ఓడినా సిగ్గు రాలేదా?..బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

ఓడినా సిగ్గు రాలేదా?..బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: 40 ఏండ్ల పాటు రాజకీయాల్లో ఉండి.. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా సిగ్గు రాలేదా? అని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును విప్​ ఆది శ్రీనివాస్​ ప్రశ్నించారు. సీఎం రేవంత్ పైనా, ప్రభుత్వంపైనా ఎర్రబెల్లి చేసిన విమర్శలపై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.‘‘ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత దయాకర్​రావు చిలుక జ్యోస్యం బాగా చెప్తున్నాడు. జ్యోతీష్యం గురించి ఆయనకు అంతగా తెలిస్తే.. ఫాంహౌస్​లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేచి బయటకు వస్తాడో చెప్పాలి.

ఫార్ములా ఈ– రేసు కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకుపోతాడో ఎర్రబెల్లి చెప్పాలి”అని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, మిగిలిన వారినైనా కాపాడుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాడని ఎర్రబెల్లిపై విప్ మండిపడ్డారు. మోదీ కులం గురించి సీఎం రేవంత్ చులకనగా ఏమీ మాట్లాడలేదని, సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.