- రాజ్యాంగం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటారు
- బీఆర్‌ఎస్‌కు అధికారం పోయాక రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకొచ్చాయా అంటూ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంపపెట్టు లాంటిదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్‌లో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని, ఐదారుగురు తప్ప.. ఆ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా ఉండరన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ గెస్ట్ హౌస్, హరీశ్ రావు నార్సింగి హౌస్‌కు పరిమితం కావాల్సిందేనని చెప్పారు. అనర్హతపై సర్వాధికారులు స్పీకర్‌కు ఉన్నాయని కోర్టు తేల్చిందని, తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచించిందన్నారు.
నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని, అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నడుచుకుంటారని, కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారన్నారు. పదేండ్లు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు చెందిన 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలోకి చేర్చుకొని, నైతిక విలువలను కాళేశ్వరంలో కలిపారన్నారు.
పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదని, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చని సిగ్గులేకుండా చెప్పుకొని తిరిగారన్నారు. అధికారం పోయాక రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకొచ్చాయా అంటూ ఫైర్ అయ్యారు.