- పదేండ్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇప్పుడు నీతులా? : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకుంటే మంచిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ‘ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు? పదేండ్లలో పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నీవు ఇప్పుడు నీతులు చెప్తావా? 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నీవు కూడా ఫిరాయింపులపై మాట్లాడుతవా?’ అంటూ ఒక ప్రకటనలో ఆయన ఫైర్ అయ్యారు.
‘ఆనాడు ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెదవ ఎవరు? విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్ కు తీసుకెళ్లిన వెధవన్నర వెధవ ఎవరు? రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు? పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెప్తావా? అంటూ మండిపడ్డారు.
‘‘మీ ఫిరాయింపుల బాగోతాలు ప్రజలకు తెలుసు కేటీఆర్.. ఇక నీ సుద్దపూస ముచ్చట్లు ఆపు”అంటూ ఆయన దుయ్యబట్టారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కేటీఆర్ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘‘ప్రజలు ఛీత్కరించినా రోజూ ఏదో ఒక వంకతో మీడియా కోసం సొల్లు వాగుడు వాగుతున్నవు. లోక్ సభ ఎన్నికల్లో జీరో చేసినా బుద్ధి రాలేదు. రాష్ట్రంలో నీకు నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి’’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.