- రాహుల్ గాంధీకి లేఖ రాయడంపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖలను విడుదల చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చిరాతలు మానుకోవాలని గురువారం ఒక ప్రకటనలో హితవు పలికారు. మతిలేని మాటలతో తమ అధినేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడంపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ప్రజా పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం చూసి ఓర్వలేకనే కేటీఆర్ లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు.
కేటీఆర్ రాసింది రాతలు కావు.. రోతలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్‌కు ఏడుపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాల ద్వారా కోటీశ్వరులను చేస్తున్నందుకా?, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? రూ.500కే సిలిండర్ ఇస్తున్నందుకా? అని నిలదీశారు. కిరీటాలు, వడ్డాణాలు, నగలు పెట్టి తెలంగాణ తల్లిని మార్చింది మీ పార్టీ కాదా? అని నిలదీశారు.