హైడ్రా ముందు అందరూ సమానమే : ఆది శ్రీనివాస్

హైడ్రా ముందు అందరూ సమానమే : ఆది శ్రీనివాస్
  • సీఎం సోదరుడికీ నోటీసులిచ్చింది
  • బీజేపీ నేతలకు హైడ్రాపై అవగాహన లేదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: హైడ్రా ముందు రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, బంధుత్వం అంటూ ఏమీ ఉండవని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అందరూ సమానమే అని అన్నారు. గురువారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పేదలైనా.. పెద్దలైనా.. హైడ్రా ముందు ఒక్కటే. తన ఇల్లు హైడ్రా పరిధిలో ఉంటే కూల్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బీజేపీ నేతలకు హైడ్రాపై అవగాహన లేదు. 

ఆ పార్టీలోని కొందరు హైడ్రాకు సపోర్ట్ చేస్తే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నరు. బీజేపీ లీడర్లంతా ముందు హైడ్రాపై అవగాహన పెంచుకుంటే మంచిగుంటది. హరీష్ రావు మీడియాతో చేసింది చిట్ చాట్ కాదు.. సోది చాట్. బీఆర్ఎస్​కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పదేండ్లు అధికారంలో ఉన్న టైమ్​లో హైడ్రా వంటి వ్యవస్థను ఎందుకు తీసుకురాలేదు? చెరువులు, నాలాలు కాపాడే పనిలో మా ప్రభుత్వం ఉంది’’అని ఆది శ్రీనివాస్ అన్నారు. 

చెరువును కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశామన్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీ విశ్వాసంతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ ఏ పని చేసినా బీఆర్ఎస్ లీడర్లంతా విమర్శించడమే పనిగా పెట్టుకున్నరు. సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి? సెక్రటేరియెట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడ్తున్నరు?’’ అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.