
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫొటోలు, వీడియోలు తీశారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభలో ఆయన స్పీకర్ ను కోరారు. ఇటీవల కమీషన్ల అంశంపై సభలో వివాదం జరగ్గా.. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సభ నుంచి లాబీల మీదుగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎంట్రీ అయ్యే దగ్గర కింద కూర్చుని నిరసన తెలిపారు.
అదే సమయంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇది అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధమని, సభకు సంబంధించిన రూల్స్ బుక్ లో ఉన్న వివరాలను చదివి వినిపించారు. అయితే, ఈ అంశం పరిశీలనలో ఉందని స్పీకర్ ప్రకటించారు.