- గత పదేండ్లలో వారిని అణిచివేశారని ధ్వజం
హైదరాబాద్, వెలుగు: మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు లేదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం వారిని అణిచివేసిందని, ఇప్పుడేమో మహిళలపై ప్రేమ ఉన్నట్లు హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న హరీశ్.. ఆ చీరలు ఎట్లున్నయో తెలంగాణ అక్కాచెల్లెల్లకు తెలుసని గురువారం ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఇచ్చిన ఆ చీరలను పాత సామాన్లకు, పంట చేనులకు అడ్డం కట్టడానికి తప్ప, మహిళలు కట్టుకోవడానికి ఉపయోగించలేదని, ఇలాంటి చీరలు ఇచ్చిన మీరు.. ఇప్పుడు వాటి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులను ఎలా గౌరవిస్తుందో మీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు.
అలాగే, ఇళ్లకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, ఇందిరా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామని, వారినే యజమానులుగా పేర్కొంటూ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తున్నామని, అంతేకాకుండా ఒక ఆదివాసీ, ఒక బీసీ మహిళకు మంత్రివర్గంలో అవకాశం కల్పించామని చెప్పారు.
మహిళలకు అన్యాయం చేశారు..
నోరు తెరిస్తే మహిళలను అవమానించేలా మాట్లాడే కేటీఆర్ పక్కనకుర్చొని హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపకపోతే తెలంగాణ అక్క, చెల్లెల్ల చేతిలో మరోసారి బీఆర్ఎస్ చిత్తు కావడం ఖాయమని హెచ్చరించారు. మీ ప్రభుత్వ హయాంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహరించింది మీరు కాదా అని ప్రశ్నించారు.
స్వయం సహాయక గ్రూపులను నిర్వీర్యం చేయలేదా.. పావలా వడ్డీ రుణాలు ఎత్తివేసి మహిళలకు అన్యాయం చేసింది మీరు కాదా.. అని నిలదీశారు. మహిళల కోసం ఒక్క కార్యక్రమమైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా అని ఆయన ప్రశ్నించారు.