
- రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు: విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: కేసీఆర్ అంటే కాళేశ్వరం కాదు.. కూలేశ్వరరావు అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ అమావాస్యకు, పున్నంకి సిరిసిల్లకు వచ్చి రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని, ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. ఆదివారం వేములవాడలో మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మల్కపేట ప్రాజెక్టు నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటకు 0.2 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ హయాంలో మల్కపేట రిజర్వాయర్ నుంచి చుక్క నీరు కూడా దేవుని గుట్ట వరకు ఇవ్వలేదన్నారు. మల్కపేట రిజర్వాయర్ పనులు చేసినా రూ.11 కోట్లు బకాయి పెడితే తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఏదో శుభకార్యానికి వచ్చిన కేటీఆర్.. రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదని, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మహనీయుల విగ్రహాలకు కూడా
ముసుగులు వేస్తారని, అలాంటిది టీ స్టాల్‌పై కేటీఆర్ ఫొటో ఉంటే తొలగించరా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆ పార్టీ నేతలు దోచుకుంటే.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్రె పడ్డదని కేటీఆర్ ఒప్పుకున్నారని, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టులో చుక్క నీరు కూడా ఆపొద్దని చెప్పారన్నారు.