- పదేండ్లు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి.. ఇప్పుడు నీతులా?
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సుద్దపూస ముచ్చట్లు చెప్తున్నారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడి యాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపైన హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, దీనిపై స్పీకర్ కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే తెలంగాణలో పదేండ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి హరీశ్ ఇప్పుడు నీతులు బోధిస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మామా, అల్లుడు ఇప్పుడు వేమన శతకాలు వల్లెవేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరసారాలు చేసిన హరీశ్ రావుకు ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి ప్రలోభాలు పెట్టి, బెదిరించి బీఆర్ఎస్ లో చేర్చుకున్న రోజులను హరీశ్ రావు మర్చిపోయినట్లున్నాడని అన్నారు. రాజ్ భవన్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఎటు పోయిందని నిలదీశారు. అప్రజాస్వామ్యం అంటు ఇప్పుడు గగ్గోలు పెడుతున్న హరీశ్.. అప్పుడు మీ మామ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏం చేశావని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు కోస్తుంటే చప్పట్లు కొట్టింది నువ్వు కాదా అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే వెకిలి నవ్వులు నవ్వింది నువ్వు కాదా హరీశ్.. సిగ్గు, లజ్జా లేకుండా పార్టీ ఫిరాయింపుల గురించి, కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతావా అని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలు వస్తాయని ఆనందపడుతున్నవా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు, నీ మామకు సిగ్గు రాలేదా అని అన్నారు. మళ్లీ నీకు ఉప ఎన్నికలు కావాలా.. తెలంగాణ ప్రజలు మరోసారి కర్రు కాల్చివాత పెడ్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.