హైదరాబాద్, వెలుగు : అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని విప్ అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన సీఎల్పీ ఆఫీసు లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని కవులు, మేధావులు, అన్ని వర్గాల వారి అభి ప్రాయాలతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరించామని తెలిపారు. దీనిపై రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకుండా సభను అవమానించారని ఆరోపించారు. పదేండ్లు రాచరిక పాలన సాగించిన బీఆర్ఎస్ నేతలు, అదానీ ఫొటోలతో సభకు రావడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తే బాగుండేదని..మంత్రి పొన్నం ఆహ్వానించినా రాలేదన్నారు.