- మళ్లి ఇట్ల మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొడుతరు : బీర్ల అయిలయ్య
హైదరాబాద్ ,వెలుగు : కేటీఆర్.. ట్విట్టర్ లో క్షమాపణ చెప్పడం కాదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలని విప్ బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. కేటీఆర్ ది పబ్బుల కల్చర్ అని, అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తుపాకీ ఎక్కుపెట్టి నైజాంలను తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం పుట్టిన గడ్డ తెలంగాణ అని, అలాంటి వారసత్వం ఉన్న మహిళల మీద కేటీఆర్చిల్లర కామెంట్లు చేశారన్నారు.
ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే మహిళలు చీపురుతో సమాధానం చెప్తారని హెచ్చరించారు. పదేండ్ల కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే.. మా సీఎం ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 కల్లా రుణమాఫీ చేశామని, 22 లక్షల 37వేల మంది రైతులకు సంబంధించిన రూ.17,933 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ పై ఇంకో సారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మా కార్యకర్తలు తాట తీస్తరని హెచ్చరించారు. బీఆర్ఎస్ పని ఖతం అయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటే తట్టుకోలేక అక్కసుతో హరీశ్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.