విప్స్ వాలెట్ వలలో.. కస్టమర్లు విలవిల!

  • సర్వర్లు పనిచేయకపోవడంతో బాధితుల ఆందోళన
  • వాలెట్​లో కనిపించని డిపాజిట్లు, ఆగిపోయిన లావాదేవీలు
  • అధిక వడ్డీలకు ఆశపడి విప్స్​వాలెట్​ లో రూ.లక్షల పెట్టుబడులు
  • జాబితాలో పోలీసులు మొదలు సామాన్యుల వరకు ఉన్నట్టు ప్రచారం

నల్గొండ, వెలుగు: విప్స్ ​వాలెట్​ వలలో చిక్కుకున్న సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నా రు. అధిక వడ్డీలకు ఆశపడి మధ్య తరగతి ప్రజలు విప్స్​ వాలెట్​లో లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు పోలీస్​అధికారులు సైతం ఈ విప్స్​ వాలెట్​లో పెట్టుబడులు పెట్టడమే గాక చైన్​ సిస్టమ్​ద్వారా స్నేహితులు, బంధువులను ఇందులోకి లాగినట్లు తెలుస్తోంది. 

ఆకట్టుకునే ఆఫర్స్​... 

విప్స్​వాలెట్​లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని ఆఫర్​చేస్తోంది. విప్స్​వాలెట్​లో చేరిన కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.100కు ప్రతినెలా రూ.10 వడ్డీ  కస్టమర్ల అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించింది. దీంతో రూ.50వేల నుంచి రూ.50 లక్షల వరకు వాలెట్​లో డబ్బులు జమ చేసిన వాళ్లు జిల్లాలో చాలా మంది ఉన్నట్లు తెలిసింది. పది రూపాయల వడ్డీ అనేసరికి లక్షల్లో వాలెట్​లో జమ​చేసే కస్టమర్లు పెరిగిపోతున్నారని గుర్తించి విప్స్​వాలెట్​ ఉన్నపళంగా వడ్డీ రేట్లను రూ.4కు తగ్గించింది. దీనిని ప్రతినెలా 5లోగా కస్టమర్ల అకౌంట్ల జమ చేస్తోంది. కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు గిఫ్ట్ వోచర్లు కూడా ఇస్తోంది. 

చైన్​ సిస్టమ్​ద్వారా పెట్టుబడులు

వాలెట్​లో ఇన్వెస్ట్​మెంట్​ అనేది చైన్​ సిస్టమ్ ద్వారా జరుగుతోంది. రూ.2వేలతో విప్స్​వాలెట్​లో అకౌంట్​ తెరవడంతో అసలు కథ మొదలవుతోంది. రెండు వేలతో అకౌంట్​ ఓపెన్​ చేస్తే దానికి అదనంగా రూ.2 వేల గిఫ్ట్​ వోచర్​ ఇస్తోంది. దీనికి మించిన పెట్టుబడులు పెడితే వడ్డీ ఇస్తోంది. పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎవరైన కొత్త కస్టమర్లను జాయిన్​ చేయిస్తే వాళ్లను కంపెనీ ఏజెంట్లుగా పెట్టుకుంటోంది. ఈ ఏజెంట్లకు వాళ్లు పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీతో పాటు కస్టమర్లను జాయిన్​ చేసినందుకు రూ.1000 వరకు కమీషన్ ​ఇస్తోంది. ఈ దందాలో ఇప్పటికే నల్గొండ పట్టణంలో వందల మంది చిక్కుకున్నట్లు తెలిసింది.

సర్వర్లు డౌన్ కావడంతో ఆందోళన

ఈ నెల 5 నుంచి వాలెట్ సర్వర్లు డౌన్ కావడంతో ఏజెంట్లు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ డబ్బులు కూడా ఈ నెల ఆలస్యంగా పడ్డాయని బాధితులు చెబుతున్నారు. పెట్టిన పెట్టబడులను క్యాన్సిల్​ చేసుకోవాలన్నా, కొత్తగా ఎవరైనా కస్టమర్లు చేర్పిద్దామన్న సర్వర్లు పనిచేయడం లేదని ఏజంట్లు చెబుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో డిపాజిట్​ చేసిన డబ్బులు, వివరాలు కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన కస్టమర్లు ఏజెంట్లపై ఒత్తిడి పెంచారు. దీన్ని నుంచి ఏదోరకంగా తప్పించుకోవాలని చూస్తున్న ఏజెంట్లు ‘విప్స్​ వాలెట్​ ఇవ్వకున్నా..  మీ డిపాజిట్లు చెల్లించే బాధ్యత మాదే’ అని సర్దిచెప్పుకుంటున్నారు. యాప్​ అప్​డేట్​ వల్లే పేమెంట్స్ కనిపించడం లేదని, జులై 1 వరకు సర్వర్లు పనిచేస్తాయని ఏజెంట్లు కస్టమ ర్లకు నచ్చజెప్తున్నట్లు తెలిసింది.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం 

విప్స్​వాలెట్ గురించి ఇప్పటి వరకు ఫిర్యాదులు అందలేదు. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్బీఐ పర్మిషన్​ ఉందా? లేదా? అనేది కస్టమర్లు చూసుకోవాలి. సైబర్​ క్రైమ్స్​ పైన అవగాహన కలిగి ఉండాలి. 

– అపూర్వరావు, ఎస్పీ, నల్గొండ