ట్విట్టర్‌‌ ఖాతాలు అన్‌ఫాలో.. వైట్‌ హౌస్‌ వివరణ

వాషింగ్టన్‌: మన దేశానికి చెందిన ట్విట్టర్‌‌ ఖాతాలను వైట్‌హౌస్‌ అన్‌ఫాలో చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్‌‌ అకౌంట్లను ఫాలో అవుతామని, ఆ తర్వాత కొన్ని రోజులకు అన్‌ఫాలో చేస్తామని వైట్‌హౌస్‌లోని అధికారులు వివరణ ఇచ్చారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్‌ను రీ ట్వీట్‌ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. “ వైట్‌హౌస్‌ కేవలం అమెరికాలోని సీనియర్‌‌ ప్రభుత్వ అధికారుల ట్విట్టర్‌‌ను మాత్రమే ఫాలో అవుతుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రం ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్‌లను కొన్ని రోజులు ఫాలో అవుతుంది” అని అధికారి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ టూర్‌‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో వైట్‌ హౌస్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంవో, అమెరికాలోని మన దౌత్యకార్యాలయం, మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, మన దేశంలోన అమెరికా రాయబారి ట్విట్టర్‌‌ అకౌంట్లను ఫాలో అయింది. ఈ మధ్య ఆ ఆరు ఖాతాలను అన్‌ఫాలో చేసింది. దీంతో ఇప్పుడు వైట్‌హౌస్‌ ట్విట్టర్‌‌లో అనుసరిస్తున్న అకౌంట్లు 13కు చేరింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్‌ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది.