వాషింగ్టన్ డీసీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై యూఎస్‌లో లంచం కేసు బుక్ అవ్వడంపై ఎట్టకేలకు వైట్ హౌస్ స్పందించింది. అదానీ వ్యవహారంపై.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడారు. అదానీపై వచ్చిన ఆరోపణలు వైట్ హౌస్ దృష్టికొచ్చాయని, ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(SEC), డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) పూర్తి సమాచారం ఇవ్వగలదని ఆమె చెప్పారు.
అమెరికా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలమైన పునాదిపై నిలిచాయని, అనేక అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉందని తెలిపారు. అదానీపై వచ్చిన ఆరోపణలను కూడా ఇరు దేశాలు పరిశీలించి, సమీక్షించి.. సమస్య పరిష్కారం దిశగా ముందుకెళతాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ స్పష్టం చేశారు.
Also Read:-డిజిటల్ అరెస్ట్ పేరుతో బిల్డర్ నుంచి కోటి కొట్టేసిన్రు
గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఆరుగురికి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వ్యక్తులకు రూ. 2 వేల 200 కోట్ల లంచాలు ఇచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణను అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు కూడా ఫైల్ అయింది. ఈ లంచాల్లో ఏకంగా రూ.1,750 కోట్లు 2021 నుంచి 2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆఫీసర్లు, వ్యక్తులకు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ సమయంలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో అదానీ లంచాల వ్యవహారం అంతర్జాతీయంగా, జాతీయంగానే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది.