
US White House: అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలపై ఒక్కసారిగా వాణిజ్య యుద్ధానికి ఎందుకు దిగారు అని అందరికీ అశ్చర్యం కలగవచ్చు. కానీ ఆయన ఎంచుకున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి ప్రపంచ దేశాలు ఎలా అడ్డంకులు వాణిజ్యంలో సృష్టిస్తున్నాయనే విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. తాజాగా వైట్ హౌస్ అమెరికా ఉత్పత్తులపై ప్రపంచ దేశాలు విధిస్తున్న పన్నుల వివరాలను బయటపెట్టింది. దీనిలో ఇండియాకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి.
తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరొలీనా లీవిట్ అమెరికా ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను చూపిస్తూ ఇది పరస్పర పన్నులకు సమయంగా పేర్కొన్నారు. భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం సుంకాలను అమలు చేస్తోందని ఆమె వెల్లడించారు. దీని వల్ల పరోక్షంగా అమెరికా ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించటాన్ని కష్టతరంగా మార్చిందన్నారు. అలాగే అమెరికా డెయిరీ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం వరకు పన్నులు విధిస్తోందన్నారు.
Also Read : ట్రంప్ దెబ్బ.. ఇళ్లకు రావాలన్నా భయంలో ఇండియన్ స్టూడెంట్స్..
ఇదే సమయంలో జపాన్ అమెరికా బియ్యంపై 700 శాతం సుంకాలను అమలు చేస్తుండగా, కెనడా అమెరికా నుంచి దిగుమతయ్యే బటర్-చీజ్ వంటి ఉత్పత్తులపై 300 శాతం పన్నులను విధిస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. ఇంత భారీగా పన్నులను వేయటం అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను దశాబ్ధాలుగా అసాధ్యంగా మారుస్తోందని అన్నారు. అందువల్ల ప్రస్తుతం దీనికి అనుగుణంగా పరస్పర పన్నుల అమలు సబబేనని ఆమె అన్నారు.
అమెరికా ప్రజలకు మేలు కలిగించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొస్తున్న టారిఫ్స్ సరైనవిగా ఆమె అభివర్ణించారు. ప్రస్తుతం యూఎస్ ప్రకటిస్తున్న సుంకాలు చాలా స్వల్పమైనవని, తాత్కాలికమైనవిగా గత నెలలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఏప్రిల్ 2 నుంచి తీసుకొస్తున్న మార్పులు పెద్ద గేమ్ ఛేంజర్ కానున్నాయని, భవిష్యత్తులో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆమె కామెంట్స్ చెబుతున్నాయి.
అయితే ఈ క్రమంలో లావిట్ ఏఏ దేశాలపై ఎంతెంత పన్నులు ప్రకటించబోతున్నారనే విషయాలను ప్రస్థావించలేదు. అసలు సుంకాలు ఎలా ఉంటాయి, ఏ ప్రాతిపధికన అమలు చేయబడతాయనే వివరాలను పంచుకోలేదు. ఆ వివరాలను నేరుగా ట్రంప్ బుధవారం ప్రకటిస్తారని లావిట్ అన్నారు. అమెరికా వ్యాపారవేత్తలు, ప్రజలకు దీనివల్ల తప్పకుండా న్యాయం జరుగుతందనే ఆశాభావం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం పెద్ద టీం పనిచేస్తున్నట్లు చెప్పారు.