ఎస్సీ సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలి: మామిడి నారాయణ

ఎస్సీ సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలి: మామిడి నారాయణ

ముషీరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో ఎస్సీ మాల, మాదిగ ఉప కులాలకు అందించిన సంక్షేమ పథకాల వివరాలపై కులాల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ మామిడి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎస్సీ కులాల సంక్షేమ పథకాలు – వాటాలు, వాస్తవాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా మామిడి నారాయణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ప్రభుత్వం అమలుచేసిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, దళితబంధు, అంబేద్కర్ ఓవర్సీస్ పథకాల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. ఎస్సీ ఉప కులాల్లో అనేక అపోహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలన్నారు. ఇతర కులాలు, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న వారికి ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రం ఒక సమాధానం అవుతుందని తెలిపారు. 

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేక కులాల మధ్య వైరం సృష్టించి పూరించలేని అగాధాన్ని సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ మాంచాల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ పట్టా వెంకటేశ్వర్లు, బత్తుల రాంప్రసాద్, డాక్టర్ నిమ్మ బాబురావు, రాహుల్, దుబ్బాక నవీన్, పులి నవీన్ తో పాటు 12 సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.