వరంగల్: వరంగల్‌లోని కాకతీయ జూ పార్క్‌కు త్వరలోనే తెల్ల పులులు, సింహాలను తీసుకొస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జూ పార్క్‌లో మౌలిక సదుపాయాల కోసం కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శనివారం (జనవరి 11) ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నా చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం జూ పార్కులో 4 రకాల జంతువులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ జూ పార్క్ నుండి రెండు పులులను కాకతీయ జూకి తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్ జూ పార్క్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జూ పార్క్ మళ్ళీ మన వరంగల్‌లోనే ఉందన్నారు.
ప్రస్తుతం మన దగ్గర ఉన్న జూ పార్కు మీడియం స్థానంలో ఉందని.. జూను మరింత విస్తరించాలని కేంద్రానికి నివేదికలు పంపించామని.. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందన్నారు. జూ పార్క్ అభివృద్ధికి ఇంకా ఎంత ఖర్చైనా చేస్తామని.. అందుకోసం కమిషనర్‌ను నివేదిక సమర్పించాలని ఆదేశించామని తెలిపారు. ఈ జూ పార్కులో కేవలం జంతువులే కాకుండా మంచి వృక్షాలు కూడా ఉన్నాయని, ఇందులో పనిచేస్తున్న అధికారులు వాటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.