వృద్ధాప్య వ్యాధులతో పాటుగా వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది. భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. తెల్లపులి ఏప్రిల్ 18వ తేదీ గురువారం అస్వస్థతకు గురి కావడంతో మందులు వాడమని సెలైన్ కూడా ఎక్కి్ంచినట్లుగా అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం తెల్ల పులి స్నేహ మృతి చెందినట్లుగా వెల్లడించారు. 2023 జూలై వరకు జంతుప్రదర్శనశాలలో ఏడు తెల్ల, మూడు మెలనిస్టిక్ పులులతో సహా 27 పులులు ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
2010 మార్చి 1న రాయల్ బెంగాల్ టైగర్ నిషాన్ , తెల్లపులి కుసుమ్‌లకు జన్మించిన స్నేహ, జంతుప్రదర్శనశాలలో ఎనిమిది పులి పిల్లలకు తల్లి అయింది. వాటిలో మూడు పులి పిల్లలు -మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ)లు ఉన్నాయి. ఆ తర్వాత మరో రెండు పులి పిల్లలు, లవ్ , కుష్‌లు స్నేహకు జన్మనిచ్చింది. 2021 మార్చి 28న పులి సైఫ్‌తో సంభోగం తర్వాత మరో మూడు ఆరోగ్యవంతమైన మగ పులి పిల్లలకు -రాకేష్, రాకీ, బన్షీలకు జన్మనిచ్చింది. కాగా సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా 2019 అక్టోబర్ లో కాలేయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణించింది.