
జెనీవా: మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) అనుమతి ఇచ్చింది. ఈ వ్యాధిపై పోరాటంలో ఇది కీలక అడుగు అని పేర్కొంది. ఈ టీకాను బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేయగా.. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ రివ్యూ చేసింది. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వాలతో పాటు గావీ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు గానీ కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం వీటి ఉత్పత్తి పరిమిత సంఖ్యలోనే జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను శీతల పరిస్థితుల్లో నిల్వ చేయాలి. 4 వారాల వ్యవధిలో 2 డోసుల్లో ఇవ్వాలి. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వొచ్చు. ఒక్క డోస్ వేసినప్పుడు టీకా 76 శాతం , రెండు డోసులు వేసినప్పుడు 82 శాతం ప్రభావాన్ని చూపినట్టు తేలింది.