ఆ రెండు పార్టీల అభ్యర్థులెవరూ?.. రసవత్తరంగా కంటోన్మెంట్ బై పోల్

ఆ రెండు పార్టీల అభ్యర్థులెవరూ?..     రసవత్తరంగా కంటోన్మెంట్ బై పోల్
  •     కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ కన్ఫర్మ్
  •     స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్, బీజేపీ  
  •     త్వరలోనే నామినేషన్ల స్వీకరణ
  •     ఊపందుకోనున్న పార్టీల ప్రచారం


కంటోన్మెంట్​,వెలుగు:   ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మృతితో కంటోన్మెంట్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ సెగ్మెంట్ కు బై పోల్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్​రిలీజ్ చేసింది. నామినేషన్ల స్వీకరణ నోటిఫికేషన్ కు పది రోజులు ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ, బీఆర్ఎస్ ​మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. బీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని లాస్య నందిత సోదరి నివేదిత ఇప్పటికే ప్రకటించారు. స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చాలామందే టికెట్ ఆశిస్తూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు అందిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కంటోన్మెంట్​ను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదల అన్నిరాజకీయ పార్టీల్లో ఉంది.  

శ్రీగణేశ్ ను ఎంపిక చేసిన అధిష్టానం 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్​మూడో స్థానంలో నిలిచింది. ఈసారి తమ ఖాతాలో వేసుకునేందుకు ఉప ఎన్నికలో తీవ్ర  కసరత్తే చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కూడా భారీ మెజార్టీతో గెలవాలని శ్రేణులను సమాయత్తం చేసింది. ఇతర పార్టీలకు దీటైన అభ్యర్థి నిలబెట్టాలని కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించింది. కొద్దిరోజుల కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన శ్రీగణేశ్​ ను చివరకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈసారి కూడా తనకే టికెట్​వస్తుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గద్దర్​కుమార్తె జీడీ వెన్నెల ధీమాతో ఉండగా.. ఆమెకు చాన్స్ ఇవ్వలేదు. 

బీఆర్ఎస్​నుంచి తీవ్ర ప్రయత్నాలు  

బీఆర్ఎస్​టికెట్ తనకే వస్తుందని లాస్య నందిత సోదరి నివేదిత ప్రచారం చేసుకుండగా.. మరోవైపు పార్టీ పెద్దలను పలుమార్లు కలిసి కోరినా.. స్పష్టమైన హామీ మాత్రం రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఈసారి తమకు ఒక చాన్స్ ఇవ్వాలని ఉద్యమకారులు అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతుంది.  టికెట్ లాస్య నందిత సోదరికి ఇస్తే ఉద్యమకారులు పార్టీ గెలుపుకు సహకరిస్తారా..? అనే ఆలోచనలో అధిష్టానం కూడా ఉన్నట్టు కార్యకర్తలు పేర్కొంటున్నారు.  టికెట్ తమకు ఇవ్వాలని మన్నె క్రిషాంక్​, గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా పార్టీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గెలవాలంటే కొందరు వారసత్వానికి ఇవ్వాలని అంటుంటే.. మార్పు చేసి వేరొకరికి ఇస్తే గెలుస్తామని ఇంకొందరు స్థానిక నేతలు పార్టీ అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది.

తెరపైకి మాదిగ నినాదం 

కంటోన్మెంట్ సెగ్మెంట్ లో మాదిగ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉండగా.. ఈసారి ఎలాగైనా టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన నేతలు తమ పార్టీలను డిమాండ్​చేస్తున్నారు. సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ ఒక్కసారి కూడా చాన్స్ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. 1985లో  మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణ కాంగ్రెస్​నుంచి గెలిచారు. మళ్లీ 2018లోనూ పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఇలా కాంగ్రెస్​ రెండుసార్లు మాదిగలకు టికెట్ ఇచ్చిందని, మిగతా ప్రధాన పార్టీలు ఇవ్వలేదని, ఈసారి కేటాయించకుంటే 200 మంది మాదిగలు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ పార్టీలకు నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు.  మొత్తంగా చూస్తే.. తాజాగా కాంగ్రెస్ తన అభ్యర్థిని కన్ఫర్మ్ చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నిర్ణయం మాత్రం ఎలా ఉండనుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. 

దీటైన అభ్యర్థి ఎంపికకు బీజేపీ కసరత్తు

గత ఎన్నికల్లో బీజేపీ నుంచి శ్రీగణేశ్ పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో మరో అభ్యర్థి వేటలో బీజేపీ పడింది. ఇప్పటికే డజను మందికిపైగా టికెట్​కోసం అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 ఏండ్లుగా పార్టీలో ఉన్న కొప్పు బాషా పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఈసారి చాన్స్ ఇవ్వాలని పరుశురామ్​, సుస్మితతో కొత్తగా చేరిన వలువురు నేతలు డిమాండ్​ చేస్తున్నారు.