అస్తవ్యస్త హైదరాబాద్​కు కారకులు ఎవరు?

హై దరాబాద్​లో చినుకు పడగానే వరద ఎందుకు వస్తుందని చాలా మందిలో ఉన్న సందేహం. హైదరాబాద్ నగరంలో ఇదివరకు ఇట్లాంటి పరిస్థితి లేదు. గత మూడేండ్లలో పరిస్థితి ఇంకా దిగజారింది. అధికారులు మాత్రం ఢిల్లీ, బెంగళూరు సహా అంతట వరదలు వస్తున్నాయంటూ నింద వర్షాలపై వేస్తున్నారు. హైదరాబాద్​లో 2020 నుంచి పరిశీలిస్తే వరద, ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. కుంటలు మాయమవడం, కాలువలు, నాళాలకు అడ్డంగా గోడలు గట్టడం, ఆకాశహర్మ్యాలు రావడం, రోడ్డు నిర్మాణం, అక్రమ కట్టడాలు తదితర కారణాలు వింటున్నాం. నాలుగు ఏండ్ల కిందట నగరంలో 2,500 ముంపు ప్రాంతాలు గుర్తించాం, వాటి మీద దృష్టి పెట్టామని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అలాంటి లోతట్టు ప్రాంతాల్లోనే ఉండే వరద ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నదో తెలుస్తలేదు. మునుపు ముంపెన్నడూ లేని కొత్త ప్రాంతాల్లో ప్రజలు వరద తిప్పలు ఎదుర్కొంటున్నారు. వచ్చిన దగ్గర మళ్లీ వస్తున్నది. అంటే అధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడ్తలేరని అర్థమవుతున్నది. వరద అంటే కేవలం వర్షపు నీటి వరద కాదు. బురద, మురుగుతో కూడిన వరద ఇండ్లను, నివాస ప్రాంతాలను, దుకాణాలను ముంచెత్తుతున్నది. భయంకరమైన వాసనతో కూడిన జలాలు ఆహార పదార్థాలను, ఇంటి సామానులను ముంచుతున్నది. వాటిని మళ్లీ వాడుకోలేని పరిస్థితి. 

జనాభా పెరుగుదల
ఒకప్పుడు హైదరాబాదులో రెండు రకాల నీటి పరివాహక వ్యవస్థ ఉండేది. ఒకటి, వర్షపు నీటిని, చెలమల నీటిని కాలువల ద్వారా కుంటల్లోకి, కుంటల నుంచి చెరువుల్లోకి, గొలుసుకట్టు ద్వారా చిన్న చెరువు నుంచి పెద్ద చెరువుకు, ఆ తరువాత అలుగు నుంచి వాగుల ద్వారా మూసి నదిలోకి చేరే సహజ నీటి పరివాహక వ్యవస్థ ఉండేది. రెండవది ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీటికి పైపులతో కూడిన వ్యవస్థ ద్వారా మూసి నదిలోకి పంపడం. అయితే నగరం కేవలం 53 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నప్పుడు, జనాభా తక్కువ ఉన్నప్పుడు, అపార్ట్​మెంట్లు, ఆధునిక కుటుంబాలు లేనప్పుడు ఈ మురుగు నీటిని ఇముడ్చుకునే సామర్థ్యం మూసి నదికి ఉండేది. క్రమంగా జనాభా పెరిగి, విస్తీర్ణం పెరిగి, జీవనశైలి మారి వేల కొద్దీ అపార్ట్​మెంట్లు వచ్చాక మురుగు నీటి ప్రవాహం పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధి దాటి వ్యర్థ జలాలు నగరంలోకి వస్తున్నాయి. మూసి నది ద్వారా నగరం దాటుతున్నాయి. లక్షల లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలు కూడా నగరం బయట నుంచి శుద్ధి కేంద్రాల పేరిట నగర మురుగు నీటి వ్యవస్థలో కలుస్తున్నాయి.

ఆ నివేదికలు ఏవి?

23 ఆగస్టు 2000లో మూసి నదిలో వరదలు వస్తే ఆనాటి ప్రభుత్వం కిర్లోస్కర్ సంస్థకు మురుగు నీటి వ్యవస్థ అధ్యయనం చేసి, దాన్ని బాగు చేయడానికి ప్రణాళిక ఇవ్వాలని కాంట్రాక్టు ఇచ్చింది. వాళ్లు 2003 నాటికి ఒక సంపూర్ణ నివేదిక ఇచ్చారు. ఆ తరువాత వోయంట్ సంస్థ వారు సర్వే నివేదిక ఇచ్చారు. 2020 తరువాత మళ్లా ఎవరికో కాంట్రాక్టు ఇస్తే వారు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత ప్రభుత్వం ఎస్​ఎన్​డీపీ ప్రాజెక్టు  చెప్పట్టింది. ఈ మూడు నివేదికలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టలేదు. ఆయా అంశాలు ప్రజలకు తెలియవు. మీడియా కూడా లోతుల్లోకి పోలేదు. సమగ్ర నాళాల అభివృద్ధి ప్రాజెక్ట్ పేరు మీద నాళాలను వెడల్పు చేసే పని చేపట్టింది. కానీ పనులు ఏ మేరకు అయ్యాయో స్పష్టమైన నివేదికలు లేవు. మురుగు నీటి కాలువలు కొత్తగా ఎన్ని కిలోమీటర్లు వేశారో చెప్పడం లేదు. గత 9 ఏండ్లలో మురుగు నీటి వ్యవస్థ మీద, కొత్తగా జోడించిన వ్యవస్థపై పెట్టిన ఖర్చు సర్కారు చెప్పడం లేదు. ప్రతి బిల్డర్ దగ్గర హైదరాబాద్ జల మండలి నీటి కనెక్షన్​కు, మురుగు నీటి కనెక్షన్​కు, జీహెచ్ఎంసీ బిల్డింగ్ ఫీజు, ప్రాపర్టీ టాక్స్ తదితర పేర్ల మీద లక్షలు వసూలు చేస్తారు. ఈ వసూలు మౌలిక వసతుల కల్పన కోసం చేస్తున్నా, వాటి మీద ఖర్చు చేయడం లేదు. హైదరాబాద్ జల మండలి నీటి వ్యవస్థ మీద పెట్టినంతగా మురుగు నీటి మీద పెడతలేదు. ఈ సంస్థ మీద ప్రజల అజమాయిషీ లేదు. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న పాలక మండలి సమావేశాలు సరిగ్గా జరగవు. వార్షిక ఆర్థిక నివేదిక శాసనసభలో పెట్టాలి. అది చేయడం లేదు. అభివృద్ధికి నిధులు లేవు. సమగ్ర ప్రణాళిక కొరవడింది.

ప్రజలకు శాపంగా..

నగర పరివాహక వ్యవస్థకు తలమానికం అయిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో భూముల ధరలు పెంచి, బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శాశ్వతంగా హాని చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో జీహెచ్ఎంసీ చేష్టలుడిగి చూస్తున్నది. అధికారులు నడిపించే హెచ్ఎండీఏ, జలమండలి ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రజల నిఘాకు దూరంగా అవినీతికి ఊతం ఇచ్చే అభివృద్ధి నమూనాలను అమలు చేస్తున్నారు. సమతుల్య అభివృద్ధిని విస్మరించారు. సుస్థిర అభివృద్ధి మచ్చుకు అయినా లేని ప్రణాళికలు ప్రజల ముందు ప్రకటనల ద్వారా పెట్టి, మభ్య పెడుతున్నారు. అస్తవ్యస్త నగర జీవనానికి తాము బాధ్యులం కామని దబాయిస్తున్నారు. ఎన్నికలు సమీస్తున్న కొద్దీ అధికారం నిలుపుకోవడానికి ప్రజా ప్రతినిధులు నిధులు సేకరించే పనిలో భాగంగా నగరంలో భూములే -కేంద్రంగా చేపడుతున్న తాత్కాలిక వ్యూహాల ద్వారా వారికి నిధులు రావచ్చు కానీ, ప్రజలకు మాత్రం శాశ్వత శాపాలుగా మిగులుతున్నాయి.

పట్టణ ప్రణాళిక ఏది?

భాగ్య నగరంలో మురుగు నీటి వరద నివారణకు జీహెచ్ఎంసీ, హెచ్​ఎండీఏ, జల మండలి సమన్వయంతో సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆదాయం మీద ఉన్న దృష్టి మౌలిక వసతుల పెట్టుబడుల మీద లేదు. పట్టణ ప్రణాళిక విభాగం పని తీరు మరీ ఘోరం. ఎవరు ఎక్కడ బహుళ అంతస్తులు నిర్మించినా రెండు రకాల ఫీజులు వసూలు చేస్తారు. ఒకటి అవినీతి వ్యవస్థలోకి, ఇంకొకటి ఈ సంస్థలకు. ఆయా సంస్థలకు వచ్చిన నిధులు కూడా అవినీతి పాలు అవుతున్నాయి. అభివృద్ధి పనులకు నిధులు ఉండటం లేదు. నగర జనాభా 2 కోట్లకు చేరుతుంటే, నగర పాలక సంస్థలు అప్పుల బారిన పడుతున్నాయి. ఆదాయం సమకూర్చుకునే ఉపాయంలో భాగంగా నగర విస్తృతి పెంచి ఫీజులు వసూలు చేస్తున్నారు తప్పితే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దాసోహం అయిన ఈ అభివృద్ధి.. నీరు, మురుగు నీరు, రవాణ, పారిశుధ్య వ్యవస్థలను మెరుగుపరచుకునే విధంగా లేదు. జీహెచ్ఎంసీ నిధులు అనవసర రోడ్ల మీద ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రణాళిక లేదు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమగ్రంగా లేదు.

తాగు నీటి కంటే మురుగు నీరే ఎక్కువ

హైదరాబాద్​కు నీటి సరఫరా బట్టి మురుగు నీరు అంతగా పెరుగుతున్నది. హైదరాబాద్ జల మండలి రోజూ సరఫరా చేసే దాదాపు176 కోట్ల లీటర్ల మంచి నీటితో, అంత కంటే ఎక్కువగా పైకి గుంజే భూగర్భ జలాలు కలిపి నగరవాసుల ఉపయోగం తర్వాత విడుదల అయ్యే దాదాపు 200 కోట్ల మురుగు నీరు పారడానికి అవసరమైన పైపులు, కాలువలు హైదరాబాద్​నగరంలో లేవు. నగరం బయట నుంచి శివారు మున్సిపాలిటీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం, ఇతర ప్రాంతాలు నుంచి వచ్చే వాటిని కలిపితే 250 కోట్ల లీటర్లు పారే వ్యవస్థ లేదు. హైదరాబాద్ నగర మురుగు నీటి వ్యవస్థ బాగు చేయాలంటే కనీసం పది వేల కోట్ల రూపాయలు అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. ఈ లెక్క అధ్యయనం చేశాక వచ్చిందా? లేదా గంపగుత్త లెక్కనా అనే విషయం పక్కన పెడితే, తెలంగాణ ప్రభుత్వం నగర మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఒప్పుకున్నట్టే. ఒప్పుకుని ఏం చేస్తున్నట్టు మరి? సగటు నగర జీవి మురుగు నీటి వరదలతో నష్టపోతుంటే, కొందరి ప్రాణాలు పోతుంటే, రోగాల బారిన పడి చితికిపోతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నది?

ధ్వంసమవుతున్న చెరువులు

చెరువులను, వాటికి వర్షపు నీరు చేరవేసే వరద కాలువలను మురుగు నీటి కాలువలుగా మార్చి సహజ నీటి వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. వర్షపు నీటి చుక్క నగరంలో పడిన వెంటనే కలుషితం అవుతున్నదంటే.. మన నీటి నిర్వహణ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో లక్షల లీటర్ల వర్షపు నీరు వృథా పోతుంటే వాడుకునే వ్యవస్థను తయారు చేయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడో నదిలో నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ఆందోళన చెందడం హాస్యాస్పదం. మెట్ట ప్రాంతం అయిన దక్కన్ పీఠభూమి మీద, సముద్రానికి దాదాపు 600 మీటర్ల ఎత్తు మీద నీళ్ల విషయంలో ఆందోళన పడకుండా చక్కటి చెరువుల పరివాహక వ్యవస్థ ఉండగా దాన్ని ధ్వంసం చేసిన ఉమ్మడి పాలకుల మీద ఉద్యమం చేసి స్వయం పాలన తెచ్చుకుని ఇప్పుడు తెలంగాణ పాలకుల తీరు అంత కంటే ఘోరంగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టం. స్వరాష్ట్రంలో చెరువుల ధ్వంసం వేగవంతమైంది. చెరువుల సుందరీకరణ పేరు మీద ప్రజల ధనంతో చెరువుల్లో మట్టి పోసి, తూములు తెగ్గొట్టి, చెరువుల విస్తీర్ణం తగ్గించి, వరద నీటి కాలువలు ఆక్రమించి, శిఖం భూములల్ల బిల్డింగ్​లు కట్టి, భాగ్యనగరంలో వరదలు రావడానికి కారణం అయ్యారు పాలకులు. స్వయంగా ఎమ్మెల్యేలు ఈ పనుల ద్వారా తమ ఆదాయ వనరులు పెంచుకునే పనిలో ఉన్నారు.


- డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌