తెలంగాణకు దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో మొదటిసారిగా రైతుల సమస్యలు, ఫ్యూడల్, భూస్వామ్య నిరంకుశ విధానాలు, దున్నేవాడికి భూమి ఉండాలన్న ఎజెండాతో దేశంలోనే సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో 1946–-51 వరకు జరిగింది. నాలుగున్నర వేల మందికిపైగా ఈ మహా పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటం దేశాన్నే కాక ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది. అనేక పోరాటాలకు సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తిని ఇచ్చింది. అనంతర కాలంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటాల ఫలితంగా అనేక చట్టాలు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు భూమిని నమ్ముకుని వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఇప్పటికీ గ్రామాల్లో 70 శాతం ప్రజలు బతుకుతున్నారు.
తెలంగాణలో మొత్తం వ్యవసాయ భూమి 1.46 కోట్ల ఎకరాల (కోటి 46 లక్షల వ్యవసాయ భూమి) ఉన్నది. కానీ, నేటికీ గ్రామీణ తెలంగాణ భూముల్లో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కొన్నింటికి పరిష్కారం లేక అనేక చిక్కుముడులుగా ఉన్నాయి. రికార్డుకు ఫీల్డ్ విస్తీర్ణ వ్యత్యాసాలు, రైతు పాస్ పుస్తకంలో అనేక అక్షర దోషాలు, కొన్ని సమస్యలకు ధరణి చట్టంలో కూడా మాడ్యుల్స్ లేక సతమతమవుతున్నారు. దాంతో ప్రభుత్వం నుంచి పొందే పెట్టుబడి సహాయం, ఎరువుల సబ్సిడీ, రైతు మరణిస్తే రైతు బీమాలాంటివి అందక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూసమస్యల పరిష్కారానికి రైతుల అవస్థలు
భూమి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో 1936, 1948, 1971, 2022 ఇలా అనేక ఆర్ఓఆర్ చట్టాలు, అనేక చట్టాలు వచ్చాయి. 1948 ఆర్ఓఆర్ చట్టం ద్వారా కాసర పహాని తయారు అయింది. 1971 ఆర్ఓఆర్ చట్టం ద్వారా వన్ బి తయారు అయింది. 1936 నుంచి 2020 ఆర్ఓఆర్చట్టాలు అమలు జరిగినా ఇంకా భూ సమస్యలు మిగిలి ఉన్నాయి. ప్రధానంగా 2020 ఆర్ఓఆర్ చట్టం సమస్యలను పరిష్కరించకపోగా రైతు సమస్యలని ఇంకా కఠినతరం చేసింది. గతంలో మండల కేంద్రాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. 2020 ఆర్ఓఆర్ చట్టం ఫలితంగా, పరిపాలన కేంద్రం, జిల్లా కేంద్రం కలెక్టరేట్, రాష్ట్ర కేంద్రం సీసీఎల్ఏకు మారింది. కాలం గడిచేకొద్దీ పరిపాలన కేంద్రం ప్రజలకు అతి దగ్గరగా ఉండాల్సింది పోయి గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మూలంగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రం, రాష్ట్ర కేంద్రం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీఆర్వోలు లేక..
గత ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల బహుశా దేశంలోనే రెవెన్యూ అధికారాలను కేంద్రీకరించిన మొదటి రాష్ట్రం మనదే కావచ్చు. గతంలో 2017లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో
పార్ట్ బి కింద నమోదు అయిన 18 లక్షల ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రతి గ్రామంలో నేడు 100 నుంచి 200 భూ సమస్యలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించే దారి చూపే గ్రామస్థాయిలో ఉండే అధికారులు లేక ప్రజలు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు. మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కౌన్సెలింగ్ చేసే గ్రామస్థాయిలో వీఆర్ఏ, వీఆర్వో అధికారులు లేకపోవడంమూలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
సాదా బైనామా రైతులకు తీరని అన్యాయం
2020 అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో సాదా బైనామా ద్వారా రైతులు 9 లక్షల 24 వేల మంది దరఖాస్తు చేసి ఉన్నారు. కానీ, 2020 ధరణి చట్టంలో సాదా బైనామాల సమస్యల పరిష్కారానికి ఎలాంటి అధికారాలు లేకపోవడం మూలంగా ఈ సమస్యలు నేటికీ అలాగే ఉండిపోయాయి. 2020 ధరణి చట్టం ఫలితంగా, మ్యుటేషన్ పై తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అప్పీల్‌కు వెళ్లే అధికారం కూడా లేకుండాపోయింది. నిజమైన కాస్తులో ఉండి, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోంది. గత ప్రభుత్వ పాలనలో అనాలోచిత చట్టాల వలన ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడం వలన ఆర్ఓఆర్ చట్టం 2020 ఫలితంగా లాభం కంటే ఎక్కువ నష్టం జరిగింది. గ్రామీణ స్థాయిలో ఉండే వీఆర్వోలను 5వేల మందిని ప్రభుత్వం తొలగించి, ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసి గత ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించింది.
ఆర్ఓఆర్ 2024 చట్టంపై విస్తృత చర్చలు
గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న చర్యల ఫలితంగా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వలన ప్రభుత్వ ఆదాయ వనరులకు కూడా గండి వాటిల్లింది. ఈ చర్యలకు గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోరుతూ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకురాబోతోంది. ఆర్ఓఆర్ 2024 ముసాయిదా చట్టం మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ఈ ముసాయిదాపై, రాష్ట్ర ప్రజల భాగస్వామ్యాన్ని కోరింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్ఓఆర్ 2024 చట్టంపై మేధావులు, రైతులు అధికారులతో, విస్తృతంగా చర్చావేదికలు 33 జిల్లాల్లో జరిగాయి. రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు ఈ సందర్భంగా మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ చట్టంలో ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచింది.
నూతన చట్టంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం
ప్రజాస్వామ్య వ్యవస్థలు పాలకులు తీసుకునే నిర్ణయాలు, ప్రజలను భాగస్వామ్యం చేయడం తద్వారా పరిపాలన ప్రజలకు ఇంకా అర్థవంతంగా అందడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో ఆర్ఓఆర్2024 చట్టం ఒక పటిష్టమైన చట్టంగా మారే అవకాశం ఉన్నది. తిరిగి రెవెన్యూ వ్యవస్థలో పూర్వవైభవం తీసుకురావడానికి ఈ చట్టం ఉపయోగపడటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే తిరిగి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను చూడడానికి గ్రామీణ స్థాయిలో ఒక అధికారిని నియమిస్తున్నట్లు ఈ చట్టం తెలుపుతున్నది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షల 24 వేల సాదా బైనామాలకు ఈ చట్టం పొందుపరిచిన సెక్షన్ 6 ద్వారా మోక్షం లభించనుంది. మొత్తంగా ఈ చట్టం రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చి రాష్ట్రంలో 65 లక్షల మంది రైతుల హక్కుల రక్షణకు ఈ ప్రజా ప్రభుత్వం పాటుపడుతుందని కోరుకుందాం.
రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వలన భూ సమస్యలున్న రైతుల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలోకి పడ్డట్టు తయారు అయింది. 2020 చట్టమూలంగా తహసీల్దార్, ఆర్డీవో అధికారాలు తగ్గినాయి. వారు కేవలం నామమాత్రపు అధికారులుగా మిగిలారు. రెవెన్యూ కోర్టులు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండేవి. దానితో ఎలాంటి ఖర్చు లేకుండా చాలా రైతుల సమస్యలకుఈ రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారం దొరికేవి. ఇప్పుడు రైతులకు సమస్యలు వస్తే సివిల్ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ధరణి చట్టం వచ్చిన తర్వాత వేల కేసులు సివిల్ కోర్టులలో నమోదు అయ్యాయి. దీని వలన కోర్టులలో కేసు గెలవాలంటే రైతుల మీద ఆర్థిక భారం పడింది.
- డా. మల్లారం అర్జున్