భవనగిరిలో కాంగ్రెస్‌, బీజేపీ క్యాండిడేట్స్‌ ఎవరు?

  • యాదాద్రి జిల్లాలో జోరుగా చర్చ
  • బీఆర్‌‌ఎస్‌కు దీటుగా ఉండే నేతలపై హైకమాండ్ల ఫోకస్
  • భువనగిరి, ఆలేరులో పదుల సంఖ్యలో ఆశావహుల  
  • తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్న నేతలు

యాదాద్రి, వెలుగు: బీఆర్‌‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాల అభ్యర్థులు ఎవరన్నదానిపై జిల్లా ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండడంతో హైకమాండ్లు ఎవరికి టికెట్ ఇస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్న ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలు టికెట్ ఇప్పిస్తాయని అనుకుంటుంటే.. ఇంకొందరు తమ గాడ్​ఫాదర్ ఇప్పిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

భువనగిరి కాంగ్రెస్‌లో పోటీ తీవ్రం

భవనగిరిలో కాంగ్రెస్​లో లీడర్ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దాదాపు పది మంది లీడర్లు ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ 1985 నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులు రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారే తప్ప గెలిచింది లేదు.  తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో.. కొంత ఊపు వచ్చింది. ఇన్నాళ్లు టికెట్ ఆశించిన డీసీసీ మాజీ అధ్యక్షుడు  కుంభం అనిల్​కుమార్​రెడ్డి బీఆర్​ఎస్​లో చేరడంతో ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది.  ఈ ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా సీట్లు కేటాయించాలన్న డిమాండ్  పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పోత్నక్​ ప్రమోద్​కుమార్,  రామాంజనేయులు  గౌడ్, పచ్చిమట్ల శివరాజ్​ గౌడ్​ సహా పది మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే డిక్లరేషన్​ ఫారం తెప్పించుకొని అప్లై చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఒకరికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అయితే  మరో లీడర్​ కూడా ఎంపీ తనకే ఇప్పిస్తారని చెప్పుకుంటున్నారు. ఇంకో లీడర్​ అయితే.. తనకు పీసీసీ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం  చేసుకుంటున్నారు.

బీజేపీ నుంచి గూడూరు

భువనగిరి నియోజవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. టికెట్​ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. అయితే బీజేపీలోనూ ఇటీవల బీసీ డిమాండ్ తలెత్తెంది.  ఈ మేరకు భువనగిరి మున్సిపాలిటీ ప్లోర్​ లీడర్​ మాయ దశరథ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు పేరు విన్పించినా.. ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం.

ఆలేరు కాంగ్రెస్‌లో..

భవనగిరితో పోలిస్తే ఆలేరులో కాంగ్రెస్​బలంగానే ఉంది. స్థానిక  సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి 2009లో తప్ప ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులు గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సారి ఇక్కడ కూడా పది మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.  ఇప్పటికే బీర్ల అయిలయ్య, కల్లూరి రాంచంద్రారెడ్డి, జనగాం ఉపేందర్​రెడ్డి అప్లికేషన్లు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ కుడుదుల నగేశ్​, బోరెడ్డి అయోధ్య రెడ్డి, నీలం వెంకటస్వామి, బండ్రు శోభారాణి సహా మరికొందరు కూడా అప్లికేషన్లు దాఖలు చేయనున్నారు. వీరిలో  కొందరికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఇంకొందరికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ  మంత్రి జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. 

బీజేపీలో నలుగురు

ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ​కోసం నలుగురు లీడర్లు పోటీ పడుతున్నారు. ఇక్కడ నలుగురు పోటీ పడడం ఈసారే ప్రథమం. బీజేపీలోనే దీర్ఘకాలికంగా కొనసాగుతూ గతంలో ఒకసారి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు టికెట్​ ఆశిస్తున్నారు. దీర్ఘకాలికంగా బీఆర్​ఎస్​లో కొససాగి గతేడాది బీజేపీలో చేరిన పడాల శ్రీనివాస్​, వట్టిపల్లి శ్రీనివాస్​ గౌడ్​, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన సూదగాని హరిశంకర్​ గౌడ్​ టికెట్​ కోసం పోటీ పడుతున్నారు. తమకే టికెట్​ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

నెలాఖరులో చింతల చేరిక?

బీఆర్ఎస్​ లీడర్​ చింతల వెంకటేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈయన కాంగ్రెస్​ అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేయడానికి ప్లాన్​చేసుకుంటున్నారు. దీర్ఘకాలికంగా కాంగ్రెస్​లో కొనసాగిన చింతల 2014లో బీఆర్​ఎస్​లో చేరారు. ఆ పార్టీ నుంచి టికెట్​ఆశించినా రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్​లో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెలాఖరులో కాంగ్రెస్​లో చేరుతారని సమాచారం. టికెట్​కన్ఫామ్​ అయితేనే పార్టీలోచేరుతారని ఆయన అనుచరులు అంటున్నారు.