చాంపియన్స్‌‌కు వెళ్లేదెవరు?..చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌పై సెలెక్టర్ల కసరత్తు

చాంపియన్స్‌‌కు వెళ్లేదెవరు?..చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌పై సెలెక్టర్ల కసరత్తు
  • రోహిత్‌‌, కోహ్లీ కొనసాగింపు
  • జడేజా, అక్షర్‌‌ పటేల్‌‌ మధ్య తీవ్ర పోటీ
  • రిజ్వర్‌‌ బ్యాటర్‌‌గా తిలక్‌‌ వర్మ!

సిడ్నీ : బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో ఎదురైన ఘోర వైఫల్యాన్ని పక్కనబెట్టి.. చాంపియన్స్‌‌ ట్రోఫీ కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు రెడీ అవుతున్నారు. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. 

ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో జరిగే సెలెక్షన్​ కమిటీ సమావేశంలో టీమ్‌‌ను ఖరారు చేయనుంది. టెస్టుల్లో తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, విరాట్‌‌ కోహ్లీని కొనసాగించే అవకాశాలున్నా.. మిగతా జట్టు ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ  నెలకొంది. గతేడాది జరిగిన వరల్డ్‌‌ కప్‌‌లో ఆడిన రాహుల్‌‌,  షమీ, జడేజాకు మళ్లీ అవకాశం దక్కుతుందా? అంటే సరైన సమాధానం రావడం లేదు. వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌ తర్వాత ఇండియా ఆరు వన్డేలు ఆడింది. ఇందులో జడేజా రెస్ట్ ఇవ్వగా, సౌతాఫ్రికా, శ్రీలంక సిరీస్‌‌లకు మాత్రం రాహుల్‌‌ను తీసుకున్నారు.

కానీ లంకతో జరిగిన సిరీస్‌‌ మధ్య నుంచే అతన్ని తప్పించారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరికి చాన్స్‌‌ ఇస్తారో చూడాలి. ఇక చాంపియన్స్‌‌ ట్రోఫీ తర్వాత ఓ ముగ్గురు సీనియర్ల భవిష్యత్‌‌పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  వచ్చే నెల 19 నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌‌లకు దుబాయ్‌‌ ఆతిథ్యమివ్వనుంది.   

జైస్వాల్‌‌కు చాన్స్‌‌!

సీనియర్ల ఫామ్‌‌లేమి కుర్రాళ్లకు బాగా కలిసొస్తున్నది. ఈ క్రమంలో టెస్ట్‌‌ల్లో రాణిస్తున్న యశస్వి జైస్వాల్‌‌ ఈ ట్రోఫీతో వన్డేల్లోనూ అరంగేట్రం చేయొచ్చు.  ఒకవేళ చాన్స్‌‌ లభిస్తే టాపార్డర్‌‌లో  బ్యాటింగ్‌‌కు అతను సిద్ధంగా ఉన్నాడు.  ఇక, ఫస్ట్‌‌ చాయిస్‌‌ వికెట్‌‌ కీపర్‌‌గా రిషబ్‌‌ పంత్‌‌ ప్లేస్‌‌ పక్కా అనుకుంటున్నా.. బ్యాకప్‌‌ కీపర్‌‌గా రాహుల్‌‌కు చాన్స్‌‌ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ రాహుల్‌‌ కీపింగ్‌‌ చేయకపోతే బ్యాటర్‌‌గా మాత్రం అతని స్థానానికి గ్యారంటీ కాదు. విజయ్‌‌ హజారే టోర్నీలో ఫెయిలైన ఇషాన్‌‌ కిషన్‌‌, సంజూ శాంసన్‌‌ గురించి ప్రస్తుతానికైతే చర్చ లేనట్లే. ఒకవేళ సెలెక్షన్‌‌లో గంభీర్‌‌ పట్టుబడితే శాంసన్‌‌కు అవకాశం రావొచ్చు. 

జడేజా X అక్షర్‌‌

వైట్‌‌బాల్‌‌ మ్యాచ్‌‌ల్లో జడేజా పెర్ఫామెన్స్‌‌ మునుపటిలా లేదు. గతంలో ఆల్‌‌రౌండర్‌‌గా విశిష్ట సేవలందించిన జడ్డూ ప్రస్తుతం జట్టుకు భారంగా కనిపిస్తున్నాడు. దీంతో వన్డేల్లో జడేజా ప్లేస్‌‌కు అక్షర్‌‌ పటేల్‌‌ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్‌‌ స్పిన్నర్‌‌గా వాషింగ్టన్‌‌ సుందర్‌‌ పనికొస్తాడని భావిస్తున్నా ఈ ముగ్గురిలో ఎవరుంటారో  చూడాలి. చైనామన్‌‌ బౌలర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ విజయ్‌‌ హజారే ట్రోఫీలో ఆడలేదు. దీంతో అతని మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై సందిగ్ధత ఉంది. ఒకవేళ కుల్దీప్‌‌కు చాన్స్‌‌ ఇవ్వకపోతే రవి బిష్ణోయ్‌‌, వరుణ్‌‌ చక్రవర్తిలో ఒకర్ని ఎంపిక చేయొచ్చు. 

రిజర్వ్‌‌ బ్యాటర్‌‌గా తిలక్‌‌ 

చాంపియన్స్‌‌ ట్రోఫీలో తెలుగు ప్లేయర్లను చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రధాన జట్టులో చోటు కష్టమే అయినా తిలక్‌‌ వర్మకు రిజర్వ్‌‌ బ్యాటర్‌‌గా చాన్స్‌‌ దక్కొచ్చు. అయితే రింకూ సింగ్‌‌ నుంచి గట్టి పోటీ ఉంది. హార్దిక్‌‌ పాండ్యా సీమ్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ కావడంతో.. ఆసీస్‌‌పై సెంచరీ కొట్టిన నితీశ్‌‌ రెడ్డిని పరిగణనలోకి తీసుకుంటారా? చూడాలి. వెన్ను నొప్పితో బుమ్రా ఈ టోర్నీకి దూరమైతే షమీని కచ్చితంగా టీమ్‌‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే అతని ఫిట్‌‌నెస్‌‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లేదంటే ఈ ఇద్దర్ని పక్కనబెట్టి కొత్త పేస్‌‌ బలగాన్ని బరిలోకి దించి కొత్త ప్రయోగం ఏదైనా చేస్తారేమో చూడాలి.