తెలంగాణ రాష్ట్రం 2014 జూన్2వ తేదీన 10 జిల్లాలతో ఏర్పాటు జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం మంచిదే అయినా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో శాస్త్రీయమైన ఆలోచన జరగకుండా.. రాజకీయమైన, వ్యక్తిగత చరిత్ర కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో జిల్లాల ఏర్పాటు జరిగినాయి. వీటి వెనుక రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, కుటుంబ అవసరాల కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది.
గతంలో ఎలాంటి రవాణా సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం, ఫోన్ సౌకర్యం లేని రోజుల్లో ఇంత పెద్ద జిల్లాలను కలెక్టర్లు పర్యవేక్షణ చేసేవారు. గ్రామాలకు సరియైన రవాణా సౌకర్యాలు లేవనే దృష్టితో, ప్రజలు చాలా దూరం ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉన్నదని, స్థానిక స్వపరిపాలన అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ ప్రభుత్వం హయాంలో మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల్లోనే ప్రజలకు ఎక్కువ పనులు జరుగుతాయి. ప్రజలకు జిల్లా కేంద్రంతో ఎక్కువ అవసరాలు ఉండవు. ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రపంచమే అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు అంతగా అవసరం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే 18 నుంచి 20 జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోయేది.
33 సంఖ్య కేసీఆర్ సెంటిమెంటా..ప్రజల అవసరమా?
33 జిల్లాలు కావాలని ప్రతిపక్షాలు కాని, మేధావులు కాని కోరలేదు. ఎలాంటి నివేదికలు అందజేయలేదు. ఉదాహరణకు కరీంనగర్ (పాత) జిల్లాను ఏడు ముక్కలు చేసి, నాలుగు జిల్లాలు ఏర్పాటు చేయడం అవసరమా?. పాత కరీంనగర్‌కు కొండగట్టు అంజన్న, వేములవాడ, రామగుండం వెలుగులు లేకుండా పోయినాయి. కరీంనగర్ అస్తిత్వం కోల్పోయినట్లుగా ప్రజలు భావించి బాధపడ్డారు. ఇదే పరి స్థితి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది.
వరంగల్ 6 జిల్లాలా?
చరిత్ర ప్రసిద్ధి పొందిన వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసి, గ్రేటర్ వరంగల్ పరిధిని రెండు ముక్కలు చేసి. హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లాలుగా విడగొట్టడం అవసరమా?. హనుమకొండ ప్రాంతం వరంగల్ నగరంలో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం మాత్రమే. వరంగల్ నగరం ఘన చరిత్ర ఉన్న వారసత్వ నగరం. నగరాన్ని విడగొట్టకుండా ఒకే వరంగల్ జిల్లాగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. 33 జిల్లాల సంఖ్య గత ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంటా లేదా ప్రజల అవసరమా.. సెంటిమెంట్ కోసం జిల్లాలు ఏర్పాటు చేయడం అవసరమా అనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచించాలి. 33 జిల్లాలకు కార్యాలయాలు కట్టడం, వాటికి బడ్జెట్ కేటాయించడం, అందులో నుంచి కమీషన్లు తీసుకోవడం వంటి రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగింది. రాజకీయ నాయకులు ఆర్థికంగా బలపడటం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ఒక కమిటీ వేసి, శాస్త్రీయమైన విభజన చేసి తిరిగి అవసరం మేరకు మాత్రమే జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
- అల్లం మల్లికార్జున్‌రావు,
ప్రధానోపాధ్యాయుడు (రిటైర్డ్)