కాంగ్రెస్​లో షర్మిల చేరిక..కలిసొచ్చే అంశాలు

కాంగ్రెస్​లో షర్మిల చేరిక..కలిసొచ్చే అంశాలు

‘ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనే’ నానుడి రాజకీయ నేతలకు సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో రాణించడమంటే ఆషామాషీ కాదు. పరిస్థితులకు అనుగుణంగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వై.ఎస్‌‌‌‌.రాజశేఖరరెడ్డి తనయగా రాజకీయాల్లో తిరుగుండదని తలచిన షర్మిల ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కాకుండా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని తప్పటడుగులు వేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేలుకున్న షర్మిలకు కాంగ్రెస్‌‌‌‌ రూపంలో ఒక అవకాశం అందివచ్చింది. వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కుటుంబానికి మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌‌‌‌లోకి షర్మిల ఘర్‌‌‌‌వాపసీ ఉభయులకూ లాభదాయకం.

షర్మిల కాలికి బలపం కట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్రలో తెలంగాణ భాష, యాసతో ప్రజల వద్దకు వెళ్లినా వారు వాటిని కృత్రిమంగానే భావించారు.  రాష్ట్ర ఉద్యమ సమయంలో వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కుటుంబం సమైక్యాంధ్రాకు అనుకూలంగా ఉండడం ఇక్కడ ఆమెకు ప్రతికూలంగా మారింది. తాను ‘తెలంగాణ కోడలిగా’ షర్మిల చెప్పుకుంటున్నా, ఆమెను ‘రాయలసీమ బిడ్డ’గానే తెలంగాణ ప్రజలు పరిగణిస్తున్నారు. ఆమె చేరికతో తెలంగాణలోని ‘రెడ్డి’, ‘క్రిస్టియన్‌‌‌‌’ సామాజిక వర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌ పట్ల సానుకూలత ఏర్పడుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. ఒకసారి గతానుభావాలను నెమరువేసుకుంటే 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టడంతో నష్టపోయామనే భావన కాంగ్రెస్‌‌‌‌లో ఇప్పటికీ ఉంది. ఆ సాకుతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌లోని ముఖ్యనేతలతో సహా కొందరు పార్టీలోకి ఆమె ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. 

షరతులు లేకుండా చేరితేనే లాభం

తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అవుతాననే షరతులు పెట్టుకోకుండా షర్మిల కాంగ్రెస్‌‌‌‌లో చేరితే ఆమెకు ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఆదరణ లభించవచ్చు. పట్టుబట్టి తెలంగాణలో పోటీ చేసి ఓడిపోతే అనంతరం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. తెలంగాణతో పోలిస్తే వై.ఎస్‌‌‌‌.రాజశేఖరెడ్డికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండడం సానుకూలాంశం. వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కుటుంబానికి గట్టి పట్టున్న రాయలసీమ నుండి షర్మిల తన రాజకీయ పున:ప్రస్థానాన్ని ప్రారంభిస్తే కచ్చితంగా రాణించే అవకాశాలున్నాయి. వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ఆత్మగా భావించే సన్నిహిత  నేతలు మొదలుకొని ఆయనను ఆరాధించే నాయకులందరూ సంపూర్ణంగా సహకరిస్తారు. ఏపీలో సంస్థాగతంగా బలహీనపడ్డ కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలకు, సానుభూతిపరులకు షర్మిల ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా 2029 నాటికైనా ఆమె ఏపీలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీని ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి.

కలిసొచ్చే అంశాలు

షర్మిల కాంగ్రెస్‌‌‌‌లో చేరడం సైద్దాంతికంగా కూడా ఆమెకు కలిసొచ్చే అంశమే. రాజశేఖరరెడ్డి యువతరంలోనే 1984లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన ఆయన సీఎం పదవి చేపట్టడానికి ఎంతో సంయమనంతో వేచి ఉన్నారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన రాజశేఖరరెడ్డి  రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పాలన చేస్తామని ప్రచారం చేస్తూ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. 2014లో రాహుల్‌‌‌‌ గాంధీని ప్రధాన మంత్రిగా చూడడం తన కల అని ఆయన చెప్పుకునేవారు. 2009 సెప్టెంబర్‌‌‌‌ 2న వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ మరణానంతరం జగన్మోహన్‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా రక్తంలోనే కాంగ్రెస్‌‌‌‌ ఉందని చెప్పి అనంతరం పార్టీని వీడారు. అందుకు భిన్నంగా ఇప్పుడు వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ అభిమానించే కాంగ్రెస్‌‌‌‌ రక్తం తనలో ఉందని,  కాంగ్రెస్‌‌‌‌లో చేరి,  వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కలైన రాహుల్‌‌‌‌ గాంధీ ప్రధాని కావడానికి కృషి చేసి తండ్రి రుణం తీర్చుకునే అవకాశం షర్మిలకు లభిస్తుంది.

ఎదుగుదలకు అవకాశాలు

షర్మిల కాంగ్రెస్‌‌‌‌లో చేరితే ఎదురయ్యే పెద్ద సవాలు జాతీయ పార్టీలో ఇమడడం. ప్రాంతీయ పార్టీల వలె సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తూ పరిమిత ఎజెండా ఆలోచనలు సాధ్యపడవు. తండ్రి రాజశేఖరరెడ్డిని స్పూర్తిగా తీసుకొని సహనంతో అవకాశం కోసం వేచి ఉంటే ఆయనలా రాజకీయాల్లో రాణిస్తారు. పాలేరు లేదా సికింద్రాబాద్‌‌‌‌ అసెంబ్లీ టికెట్‌‌‌‌, తన అనుచరులకు టికెట్లు వంటి తాత్కాలిక ప్రయోజనాలతో కాకుండా హుందాగా రాజకీయ ఎదుగుదలకు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. రాహుల్‌‌‌‌, ప్రియాంక గాంధీలతో సత్సంబంధాలు పెంచుకుంటే పార్టీలో యువనాయకురాలిగా గుర్తింపు రావచ్చు. యువనేత నుంచి సీఎం  స్థాయి వరకు ఎదిగిన వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌లా తండ్రికి మించిన బిడ్డగా రాజకీయల్లో రాణించవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో, ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేసి  తెలుగు ప్రజలకు సుపరిచితులైన షర్మిలకు కాంగ్రెస్‌‌‌‌లోకి ఘర్‌‌‌‌వాపసీ ఒక సువర్ణావకాశం. తెలంగాణలో 3800 కి.మీలకుపైగా పాదయాత్ర నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొంది ఇండియన్‌‌‌‌ బుక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రికార్డ్సులో చోటు సంపాదించిన షర్మిలకు ఏపీలో కాంగ్రెస్‌‌‌‌ను పటిష్టపరిచే అవకాశమొచ్చిందని చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని తెలంగాణ కోసం పట్టుబట్టి అపవాదును మూటగట్టుకోవడమా..? లేదా కష్టపడితే గుర్తింపు వచ్చే ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో  క్రియాశీలకంగా ఉండడమా అనే అంశాన్ని రాజకీయ చతురతతో షర్మిల నిర్ణయించుకోవాలి.

రాజన్న రాజ్యం నినాదంతో..

 వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ తనయుడు జగన్మోహన్‌‌‌‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీ ఎదుగుదల కోసం అన్నకు చేదోడుగా ఉన్న షర్మిల 2019లో ఏపీలో జగన్‌‌‌‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక కుటుంబంలో వచ్చిన విభేదాలతో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ బదులు తెలంగాణను రాజకీయ వేదికగా ఎంచుకున్నారు. 2021 వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ జయంతి రోజున వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌టీపీ ప్రారంభంతో తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన షర్మిలకు 2022 వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ జయంతి రోజున తల్లి విజయమ్మ వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీని వీడి కూతురుకి తోడుగా నిలిచారు. ‘రాజన్న రాజ్యం’ అందించడమే తన లక్ష్యమని షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఆమె కోరుకున్న ‘రాజన్న రాజ్యం’ అవసరం ఎంతో ఉందనే వ్యాఖ్యలు తెలంగాణలో వినిపించాయి.

చేరితే.. కాంగ్రెస్​కు బలమే

పాదయాత్ర సందర్భంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజాప్రతినిధులపై చేసిన వ్యక్తిగత దూషణలు పరిమితిని మించడం ఆమెకు ప్రతికూలంగా మారింది.  షర్మిల వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ఆప్తుల రాయబారంతో కాంగ్రెస్‌‌‌‌తో చేతులు కలపడానికి ముందుకు వచ్చారు. వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌తో పార్టీకి ఉన్న అనుబంధంతో కాంగ్రెస్‌‌‌‌ అధిష్టానం కూడా అందుకు సానుకూలంగా స్పందించింది. కాంగ్రెస్‌‌‌‌ జాతీయ పార్టీ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సత్తాను చాటే అవకాశం షర్మిలకు ఉంటే, మరోవైపు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ప్రస్తుతం ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌‌‌‌కు ఆమె చేరిక వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్‌‌‌‌ అధిష్టానంతో పార్టీలో చేరికపై జరిగిన చర్చల్లో ఆమె ఆంధ్రప్రదేశ్‌‌‌‌ కంటే తెలంగాణలో రాజకీయాలకే ప్రాధాన్యతిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశం కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చేరితే లభిస్తుంది. రాజకీయాల్లో బలాలు, బలహీనతలపై అం చనా ఏర్పర్చుకొని నిర్ణయాలు తీసుకుంటేనే రాణిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీలో చేరడం జగన్మోహన్‌‌‌‌రెడ్డికి కలిసివచ్చింది. 

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ