టీఆర్ఎస్ ప్లీనరీతో ఎవరికి లాభం?

21 ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అయితే ముగిసింది కానీ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేండ్లపాటు అధికారంలో ఉన్నా.. ప్రజలు కష్టాలు తీరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ఆకాంక్షలకు కేసీఆర్ ప్రభుత్వం గండికొట్టింది. నీళ్ల విషయంలో కేవలం తన కుటుంబ సభ్యుల మూడు నియోజక వర్గాలకు వచ్చేలా, తన కాంట్రాక్టర్ మిత్రులకు సంబంధించిన ప్రాజెక్టును రూపొందించుకున్నారు తప్ప తెలంగాణలోని అన్ని జిల్లాలను సస్య శ్యామలం చేసే ప్రయత్నం చేయలేదు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి నిధులు ఖాళీ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీల ఊసే లేదు. ఎనిమిదేండ్లుగా నియామకాలు చేపట్టలేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగించింది. అధికారంలోకి రాకముందు అనేక హామీలిచ్చిన కేసీఆర్ ​వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఉద్యమం ముందు ఓ మాట.. తర్వాత మరో మాట చెబుతూ.. ఆయన ప్రతీసారి ప్రజలను మోసం చేస్తున్నరు. 


తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకొని కేసీఆర్ విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను రాజకీయ పునరేకీకరణగా ముఖ్యమంత్రి అభివర్ణిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందరికి తెలుసు. 2014 ఎన్నికల్లో శాసనసభలో టీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యత వచ్చినా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు ప్రతిపక్షాలకు లేకపోయినా సుమారు 30 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీల నుంచి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించిన వారికి మంత్రివర్గంలో కీలక శాఖలు కట్టబెట్టారు. ఉద్యమానికి సంబంధం లేని వారు ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. దీంతో సహజంగానే మొదటి నుంచీ ఉద్యమాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారిలో అసహనం పెరుగుతోంది. సామాన్యుడిని పాలనలో భాగస్వామ్యం చేయకుండా డబ్బు, పలుకుబడి ఉన్న, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ద్రోహులకే  కేసీఆర్ ​పెద్దపీట వేశారు. పార్టీ ఆవిర్భావంలో ఉన్న నాయకులు ప్రస్తుతం లేరు. రాజకీయాలను, ఎన్నికలను డబ్బు, నల్లధనం శాసించే స్థాయికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బు పంపిణీ చేసింది. పెట్టుబడిదారులే రాజకీయాలను శాసించడం, ఇవాళ పెట్టిన పెట్టుబడి రేపు రెట్టింపు చేసుకునే నీచ రాజకీయాలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. వందల కోట్ల ఖర్చు దేనికి సంకేతం. ఇది ప్రజాస్వామ్యమా ధన స్వామ్యమా? ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన పన్నులే ప్రభుత్వాలకు ఆదాయం. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ప్రమేయం లేకుండా అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, సంక్షేమ పథకాల పేరు మీద అయినవారికి, కాని వారికి పప్పు బెల్లాలు మాదిరిగా ప్రజాధనాన్ని ఓట్ల కోసం పంచే అధికారం ఎవరు ఇచ్చారు? తెలంగాణలో టీఆర్ఎస్ ఏమి సాధించాలనుకుంటోంది? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం ఇంటింటికీ పంచిన నోట్ల కట్టలను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకున్నది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సకల జనులు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఈ మూడింటిని ఒక కుటుంబమే స్వాహా చేసింది. 

సాగునీటి ప్రాజెక్టుల్లో అలసత్వం

రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల పంపకం విషయంలో 299 టీఎంసీల నీటి ఒప్పందంపై సంతకం చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలువరించడంలోనూ ఆయన విఫలమయ్యారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని కూడా గాలికొదిలేసింది. వైద్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు వైద్య అవసరాల కోసం ఏ ఒక్క భవనాన్ని కూడా కొత్తగా నిర్మించిన పాపాన పోలేదు. విద్యారంగాన్ని పట్టించుకోవడం మానేసిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, పేదరికం, సాంఘిక అసమానతలు, మౌలిక వసతులు, పాఠశాలల లేమి కారణంగా చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు నోచుకోక బాలకార్మికులుగా మారుతున్నారు. ఇలాంటి సందర్భంలో వేలాది స్కూళ్లను మూసివేయడం దుర్మార్గకరం. ఇంటికో ఉద్యోగం ఊసేలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ పత్తా లేదు. నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదు. 

విద్యుత్ ఛార్జీల భారం..

కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపింది. డిస్కంలకు రూ. 50 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించకపోవడంతో అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న పాతబస్తీలో కరెంట్ బిల్లులను సరిగా వసూలు చేయలేని అసమర్థత కేసీఆర్ ప్రభుత్వానిది. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ 30 మంది ఆర్టీసీ కార్మికుల చావుకు కారణమయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఛార్జీలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీల వాటా దాదాపు18 శాతం ఉంది. అలాంటి దళితులకు అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోంది. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అవుతారని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత మాట తప్పారు. 3 ఎకరాల భూమితో పాటు పెట్టుబడి సాయం అందిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. సంక్షేమం మాట అటుంచితే.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. 6 ఉన్న పబ్స్ 89 అయ్యాయి. రూ.10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయం .. రూ.36 వేల కోట్లకు చేరింది. కిలోల కొద్దీ గంజాయి నగరానికి చేరుతోంది. మద్యం తాగించడం.. డ్రగ్స్ ను ప్రోత్సహించడం నిత్య కృత్యంగా మారింది.  ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. జీహెచ్ఎంసీ అప్పులకుప్పగా మారింది. ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో రూ.100 కోట్ల వడ్డీ పొందిన బల్దియా ఇప్పుడు కనీసం జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ పార్టీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణలో ఏ ఒక్క వర్గం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయాలతో కుటుంబ, రాచరిక, నిరంకుశ పాలన కొనసాగిస్తున్న అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.

వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం

అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ సర్కారు.. ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను వంచిస్తోంది. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో.. వారి పేరిట జమవుతున్న  రైతుబంధు డబ్బులను.. బ్యాంకర్లు పాత బకాయిల వడ్డీల కింద పట్టుకుంటున్నారు. దీంతో సాగుకు పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రా రైస్ తీసుకోబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఫుడ్​కార్పొరేషన్​ ఆఫ్ ​ఇండియా గానీ చెప్పలేదు. కానీ వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరతీసింది. దళారులతో సిండికేట్ గా మారి అఫీషియల్ గా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేసింది. వరి వేయొద్దని ఒకసారి, వేయాలని మరోసారి చెప్పి రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేసింది.

- డా. కె. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు