- ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కూడా పెరుగుతున్నయ్
- వారంలో 150 % ఎక్కువ కేసులు
జెనీవా/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఒమిక్రాన్ కమ్మేస్తోంది. ఇప్పటిదాకా 171 దేశాలకు ఈ కొత్త వేరియంట్ పాకినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. త్వరలోనే డెల్టాను దాటేస్తుందని చెప్పింది. ‘‘జనవరి 20 నాటికి 171 దేశాల్లో ఒమిక్రాన్ బయటపడింది. ఇప్పటికే చాలా దేశాల్లో డెల్టాను దాటేసింది. దీంతో అన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి” అని వివరించింది. ‘‘వ్యాధి తీవ్రత, డెత్ రేటు తక్కువని చెబుతున్నా.. ఈ వేరియంట్ కూడా ప్రమాదకరమే. గత వేరియంట్లతో పోలిస్తే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొంది.
హాస్పిటలైజేషన్ కూడా పెరుగుతోందని, దీంతో చాలా దేశాల్లో హెల్త్ సిస్టమ్‌పై ఎక్కువ ప్రభావం పడుతోందని తెలిపింది. డెల్టా కంటే వేగంగా, ఎక్కువగా మానవ శ్వాసనాళ కణజాలాన్ని ఒమిక్రాన్ ఇన్ఫెక్ట్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కూడా పెరుగుతున్నాయని, బీఏ.1 రకం డామినెంట్‌గా ఉండేదని, ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా, బ్రిటన్, డెన్మార్క్ తదితర దేశాల్లో బీఏ.2 రకం ఎక్కువగా ఉంటోందని చెప్పింది.
గత వారంలో 15.94 లక్షల కేసులు
సౌత్ ఈస్ట్ ఆసియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఇండియాలో గత వారం రోజుల్లో కేసులు 150 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. గత వారంలో ఇండియాలో 15.94 లక్షల కేసులు వచ్చాయని, కానీ అంతకుముందు వారంలో 6.38 లక్షలు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది.
మూడు రోజులుగా కొత్త కేసులు తగ్గుతున్నయ్
వరుసగా పెరుగుతూ వచ్చి బంబేలెత్తించిన కరోనా కేసులు.. కాస్త తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం 3.47 లక్షలు, శనివారం 3.37 లక్షలు, ఆదివారం 3.33 లక్షల కేసులు నమోదు అయ్యాయి. సోమవారం 3.06 లక్షల కేసులు వచ్చాయి. ఆదివారంతో పోలిస్తే ఇది 8.2 శాతం తక్కువ. యాక్టివ్ కేసులు 22.49 లక్షలకు పెరిగాయి. 241 రోజుల తర్వాత ఆ స్థాయికి చేరాయి. గత 24 గంటల్లో 439 మంది చనిపోయారు. రికవరీ రేటు 93.07 శాతానికి పడిపోగా, యాక్టివ్ కేసులు 5.69 శాతానికి పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు ఏకంగా 20.75 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 17.03 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 162.26 కోట్ల డోసులు వేశారు.