తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్లకే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందన్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ డిసైడ్ చేయనుందని వెల్లడించారు. పీసీసీ చీఫ్ , క్యాబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకే సారి ఫైనల్ అవుతాయన్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పీసీసీ చీఫ్ గా తాను రెండు ఎన్నికలు పూర్తి చేశానని.. జూలై 7తో మూడేళ్లు పూర్తి కానుందని వెల్లడించారు.
రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్న సీఎం రేవంత్.... వాటి ఇంట్రస్ట్ ల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పోస్టింగ్స్ లో తాము రూల్స్ బ్రేక్ చేయాలని అనుకోవడం లేదన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవని చెప్పిన సీఎం.. సర్ ప్లస్ పవర్ కొంటున్నామని వెల్లడించారు. మహిళల ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ గట్టున పడిందని తెలిపారు.