ఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో పైసా మిగలక రైతులు అప్పులపాలవుతున్న  టైమ్​లో ఎరువుల ధరల పెరుగుదల రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. పెట్టుబడిపై కనీస లాభాన్ని కళ్లజూడలేకపోతున్న రైతులు.. ఏడాదికేడాది పెట్టుబడులు పెరుగుతుండడంతో వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది. పెట్టుబడికి సరిపోను రుణాలను బ్యాంకులు ఇవ్వకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి తెచ్చి అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారు. అవి భారమై చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో 60 శాతం మంది కౌలు రైతులుంటున్నట్టు ఎన్‌‌సీఆర్‌‌బీ రిపోర్టు చెబుతోంది.

మన దేశంలో తయారీపై దృష్టేది?
వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో ఇంకా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో సగటున ఎకరాకు 75  కిలోల ఎరువులు వాడుతున్నాం. ఇతర దేశాల్లో ఎకరాకు 200 కిలోలు వాడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో కలిపి రసాయన ఎరువుల వాడకం పెంచడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు. గత పదేండ్లుగా దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల స్థిరంగానే ఉంది. 2021‌‌‌‌–-22లో  కోటి టన్నుల ఉత్పత్తి పెరగడంతో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.16 కోట్ల టన్నులకు పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. మిగిలిన పంటల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. వీటితోపాటు మరో రూ.3 లక్షల కోట్ల విలువైన నూనెలు, పంచదార, పప్పులు, పత్తిని దిగుమతి చేసుకున్నాం.

రేట్లపై నియంత్రణ ఎవరిది?
మన దేశానికి ఎరువుల్ని దిగుమతి చేసే దేశాలు లాబీగా ఏర్పడి రేట్లు, డిమాండ్​ను కంట్రోల్​ చేస్తున్నాయి. దీంతో మనం తీవ్రంగా నష్టపోతున్నాం. చివరకు  క్రిమిసంహారక మందులు, బయోపెస్టిసైడ్స్‌‌, బయో ఫెర్టిలైజర్స్‌‌ తోపాటు వాటి తయారీ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ఇండియా  విదేశీ మారకద్రవ్యాన్ని కూడా కోల్పోతున్నది. కాంప్లెక్స్‌‌ ఎరువుల కంపెనీలు ధరలు ఇష్టానుసారం పెంచుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ప్రతి ఎరువు ధరను కేంద్రం నిర్ణయించాల్సిందే. కానీ ఇటీవల కంపెనీలు, వ్యాపారులు ధరలు పెంచుకోవడంతో రైతులు గతంలోకంటే ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వస్తోంది. 

తయారీని ప్రోత్సహించాలె
రైతుల పెట్టుబడిని తగ్గించడంలో ఎరువుల ధరలు కీలకం. ఎరువులు, ఉపకరణాల ధరలు పెంచి  2022లో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని కేంద్రం ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో రైతుల పెట్టుబడిని తగ్గించడం కేంద్రంపై ఉన్న ప్రధాన బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులు సక్రమంగా వ్యవసాయం చేయగలుగుతారు. ఎరువుల ధరల నియంత్రణ మన చేతుల్లో ఉండాలంటే ఇప్పటికైనా స్వదేశంలో తయారీని ప్రోత్సహించాలి. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఎరువుల వాడకం మోతాదును తెలియజెప్పాలి. ఎరువుల ధరలు, సప్లయ్, వాడకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్లాన్​తో ముందుకెళ్లాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి రైతు గట్టెక్కాలంటూ వెంటనే ఎరువుల ధరల్ని తగ్గించాలి.

తగ్గిన సబ్సిడీ..
2020–-21 ఏడాది మినహా పెరుగుతున్న బడ్జెట్‌‌కు అనుగుణంగా, డాలర్‌‌ విలువ పెరుగుదలను లెక్కలోకి తీసుకుని ఎరువుల సబ్సిడీని కేంద్రం పెంచలేదు. గత ఏప్రిల్‌‌లో 58 శాతం పెంచిన ఎరువుల ధరలు ఆందోళన ఫలితంగా తగ్గించినప్పటికీ తిరిగి వ్యాపారులు సబ్సిడీ తగ్గిందన్న పేరుతో ధరలు విపరీతంగా పెంచారు.  పెంచిన ధరలపై కేంద్రం స్పందించకపోవడంతో చాలా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ముంచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నత్రజని, భాస్వరం, పొటాష్‌‌ ఎరువుల వాడకం 272.28 లక్షల టన్నులు. ఇందులో పొటాష్​ వాడకం 26.80 లక్షల టన్నులు. ఇది పూర్తిగా 100 శాతం దిగుమతి చేసుకోవాల్సింది. యూరియా, డీఏపీ కూడా దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న యూరియాపై 2019–-20లో రూ.53,619 కోట్లు సబ్సిడీని కేంద్రం చెల్లించింది. భాస్వరం, పొటాష్​కు రూ.26,335 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. 

కేంద్రం తగ్గించినా..
కిందటి ఏడాది పెంచిన ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో  కేంద్రం వాటిని తాత్కాలికంగా పెండింగ్‌‌లో పెట్టింది. 2022 జనవరి 10 వరకు పాత ధరలే ఉంటాయని చెప్పింది. కానీ కాంప్లెక్స్‌‌ ఎరువుల తయారీ  కంపెనీలు అప్పటికే కేంద్రం ప్రతిపాదించిన ధరలను ఇంకాస్త పెంచి అమల్లోకి తీసుకొచ్చాయి. కేంద్రం తమకిచ్చే సబ్సిడీని తగ్గించడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రచారం చేసుకున్నాయి. ఈ రేట్ల కట్టడికి కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా కాంప్లెక్స్‌‌ ఎరువుల  తయారీ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తుంది. కానీ కంపెనీలు షార్టేజ్​ సృష్టించి బ్లాక్​లో అమ్మి రైతులకు రాయితీని దూరం చేశాయి. ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు సబ్బిడీ అందక రైతులు నష్టపోయారు.

- మూడ్‌‌ శోభన్‌‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం