భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు ఉండాలని 1934లో కమ్యూనిస్టు నేత ఎం.ఎన్.రాయ్ తొలిసారి ప్రతిపాదించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో మొదటిసారి రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేసింది. వయోజన ఓటింగ్ విధానం ద్వారా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ ఉండాలని కాంగ్రెస్ పక్షాన జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రకటన చేశారు. ఈ డిమాండును 1940లో ఆగస్టు ఆఫర్ రూపంలో బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించింది. 1942లో ఇండియాకు వచ్చిన క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఈ ప్రతిపాదనలను ముస్లిం లీగ్ తిరస్కరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.
క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిత్తులోని సభ్యుల ఎన్నిక విధానం, సంఖ్య నిర్ణయించారు. ప్రతి రాష్ట్రానికి, స్వదేశీ సంస్థానాలకు వాటి జనాభా ప్రతిపాదికపై సీట్లను కేటాయిస్తారు. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. బ్రిటీష్ పాలిత ప్రాంతాల్లో మూడు ప్రధాన వర్గాలైన ముస్లింలు, సిక్కులు, జనరల్ క్యాటగిరీ ప్రజలకు వారి జనాభా దామాషా మేరకు సీట్లను కేటాయిస్తారు. ప్రతివర్గం ప్రతినిధులను ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు. స్వదేశీ సంస్థానాల ప్రతినిధులను స్వదేశీ సంస్థానాల అధిపతులు నామినేట్ చేస్తారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ సభ్యుల్లో బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్లు 296. వీటిలో 11 రాష్ట్రాలకు 292 సీట్లు, మిగిలిన 4 సీట్లను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, కూర్గ్, బెలూచిస్తాన్, అజ్మీర్ మేర్వార్ ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. స్వదేశీ సంస్థానాలకు కేటాయించిన సీట్లు 93.
ఎన్నికలు
1946, జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో బ్రిటీష్ ఇండియాకు కేటాయించిన 296 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు స్థానాలు సాధించాయి
దేశ విభజనతో రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299కు తగ్గిపోయింది. వీరిలో బ్రిటీష్ ఇండియా నుంచి ఎన్నికైన వారు 299 మంది ఉండగా, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది సభ్యులు ఉన్నారు.
మొదటి సమావేశం: 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి 211 మంది హాజరయ్యారు. ఇందులో 9 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 207 మంది సభ్యులు రిజిస్టర్ సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ముస్లింలీగ్, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు హాజరు కాలేదు. డిసెంబర్ 9న ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం జె.బి.కృపలాని ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకొని అందరి కంటే వయసులో పెద్దవాడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంకో అంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ ను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా జె.బి. కృపలాని ప్రతిపాదించగా, హెచ్సీ ముఖర్జీని రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షునిగా పట్టాబి సీతారామయ్య ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో ఉపాధ్యక్షుడిగా వి.టి.కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
ఆశయాల తీర్మానం: 1946, డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో జవహర్ లాల్ నెహ్రూ ఎనిమిది అంశాలతో కూడిన చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆశయాల తీర్మానం రాజ్యాంగ ఆదర్శాలకు, లక్ష్యాలకు ఆధారం. 1947, జనవరి 22న ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజ్యాంగం ఆమోదం
1948, డిసెంబర్ 4న బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగం చివరి ముసాయిదా ప్రవేశపెట్టారు. మొదటి రీడింగ్ పైన నవంబర్ 9 వరకు సాధారణ చర్చ జరిగింది. రెండో రీడింగ్ 1948, నవంబర్ 15న ప్రారంభమై 1949, అక్టోబర్ 17న ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 7635 సవరణలు ప్రతిపాదించగా, 2473 ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ముసాయిదా మూడో రీడింగ్ 1949, నవంబర్ 14న ప్రారంభం కాగా, ఆ సందర్భంలోనే అంబేద్కర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1949, నవంబర్ 26న ఆమోదించింది. మొత్తం 299 సభ్యులు గల పరిషత్తులో ఆ రోజు 284 మంది హాజరై రాజ్యాంగం తుది ముసాయిదాపై సంతకాలు చేశారు. భారతదేశ ప్రజలు రాజ్యాంగాన్ని అంగీకరించి దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని ప్రవేశికలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ప్రవేశికను ఆమోదించారు. ఈ విధంగా ఆమోదించిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, ఒక ప్రవేశిక ఉన్నాయి.
వాయిదాకు కారణం
1929, డిసెంబర్29న కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1930, జనవరి 26 నుంచి పూర్ణ స్వరాజ్ గా జరుపుకున్నారు. ఆ తేదీకి దగ్గరలో ఉండటం వల్ల రాజ్యాంగం అమలును జనవరి 26కు వాయిదా వేశారు.1950, జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత ప్రభుత్వ చట్టం - 1935, భారత స్వాతంత్ర్య చట్టం-1947 రద్దయ్యాయి.
రాజ్యాంగం అమలు
పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, సంగ్రహనామం అనే అంశాలు రాజ్యాంగం ఆమోదించిన నాటి నుంచే అమలులోకి వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ మరో సమావేశం 1950, జనవరి 24న నిర్వహించింది. రాజ్యాంగంలోని ఎక్కువ భాగం 1950, జనవరి 26 నుంచి అమలులోకి రావడంతో ఆ రోజును రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీగా పరిగణించారు. 1949, నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించినా 1950, జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.