విశ్లేషణ: విశ్వనగరం పేరుతో ఇన్ని అబద్ధాలా?

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో 18 రాష్ట్రాల వాళ్లు నివసిస్తుండగా వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ను విశ్వనగరంగా మార్చారు” అని ప్రకటించారు. ఆ ప్రకటన చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు హైదరాబాద్​ను ఎవరు అభివృద్ధి చేశారు? హైదరాబాద్​ అభివృద్ధి ఎలా జరిగింది? చరిత్ర తెలవని వారు తామే హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం చూస్తున్నాం. ఈగలు కుమ్మరి చక్రంపై కూర్చొని తామే ఆ చక్రాన్ని తిప్పుతున్నామంటూ అనుకోవడం మాదిరిగానే వీరి మాటలు ఉన్నాయి. మనదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాగా, 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనమైంది. ప్రస్తుతం 1.05 కోట్ల మందితో తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్​ ఉంది. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణను టీఆర్ఎస్ 7 సంవత్సరాలుగానే పరిపాలిస్తున్నది. 

అభివృద్ధి అంతా 2014కు ముందు జరిగిందే

ఆంధ్రప్రదేశ్ లో విలీనం కాకముందే బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం, చత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి జనం పెద్ద సంఖ్యలో వలస వచ్చారు. వీరంతా వ్యాపారం లేదా ఉద్యోగం నిమిత్తం వచ్చి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 50 కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయి. బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎస్ఎఫ్ సీ, ఎస్ఆర్ఎఫ్, డీఎల్ ఆర్ సీ, డీఆర్‌‌డీఎల్, డీఆర్డీవో, మిథాని, ఇండియన్ ఎయిర్ లైన్స్, బీడీఎల్ లాంటి సంస్థలతోపాటు దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. వల్లభ్​భాయ్ పటేల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్, మెట్రోలాజికల్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్​మెంట్​ సంస్థలు, పోస్టాఫీసులు, సర్వే ఆఫ్ ఇండియా లాంటి భారీ సంస్థలు కూడా వచ్చాయి. ఇవికాక 29 యూనివర్సిటీలను పెట్టారు. 207 రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఈ సంస్థల్లో లక్షలాది మందికి ఉద్యోగ వసతి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దశాబ్దం తర్వాత క్రమంగా కొన్ని పరిశ్రమలను మూసివేసి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించారు. 1990లో ఐటీ రియల్​ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున పుంజుకుంది. రోజువారీ 20 లక్షల మంది బయట నుంచి హైదరాబాద్ రావడం, పోవడం జరుగుతోంది. అనగా కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నట్లు లెక్క. దీనికి తోడు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ నుంచి బిల్డింగ్ నిర్మాణ పనులకు లక్షల మంది వచ్చిపోతుంటారు. ఇదంతా 2014కు ముందు జరిగిన అభివృద్ధి మాత్రమే.

వాతావరణం ప్రత్యేకం

హైదరాబాద్ వాతావరణం మనదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కాలాన్ని బట్టి వాతావరణంలో మార్పులు ఉంటే హైదరాబాద్​లో వాతావరణానికి భిన్నంగా మార్పులు ఉంటాయి. ఎండాకాలం చల్లగా ఉండడం వల్ల రాష్ట్రపతి ప్రతి ఏటా మే నెలలో 21 రోజు ఇక్కడే ఉండడానికి శాశ్వతంగా హైదరాబాద్ బొల్లారంలో వసతి ఏర్పాటు చేశారు. సమశీతోష్ణ ప్రాంతంగా ఉండడం వల్ల నేటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు తమ ముగింపు జీవనాన్ని ఇక్కడే గడపడానికి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందువల్ల సిటీ జనాభా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు హైదరాబాద్​ సిటీలో నిరుద్యోగులు 6.2 శాతం ఉన్నట్లు సీఎంఐఏ సర్వే వెల్లడించింది. కుక్కలు, పందులు, కోతులు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. వందల మంది వాటి బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.

తాగునీటికి సమస్య లేదు

ఏ నగరమైనా అభివృద్ధి చెందడానికి తాగునీరే కీలకం. ఉస్మాన్ సాగర్(25 ఎంజీడీ), హిమాయత్ సాగర్ (14 ఎంజీడీ), మంజీర (120 ఎంజీడీ), గండిపేట లాంటి చెరువులు ఉండడం వల్ల ఆ నీటిని వినియోగించుకొని హైదరాబాద్ విస్తరించింది. ఆ తర్వాత కృష్ణా 1 నుంచి 4 ఫేజ్ లుగా, ఒక్కో ఫేజ్ కు 90 ఎంజీడీల చొప్పున నీరు వస్తున్నది. దీనికి తోడు గోదావరి నుండి 172 ఎంజీడీల నీరు వస్తున్నది. ఇన్నర్​ రింగ్ రోడ్, ఔటర్​ రింగ్ రోడ్, రీజినల్​ రింగ్ రోడ్లు ఏర్పడినప్పటికీ అంత వైశాల్యానికి కావాల్సిన తాగునీటి లభ్యత హైదరాబాద్​కు ఉంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తేవడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా హైదరాబాద్ లో తాగునీటి వ్యాపారం వేల కోట్లలో సాగుతున్నది. బహుళజాతి కంపెనీలు అనేకం ఇక్కడ రోజూ కోట్ల వ్యాపారం సాగిస్తున్నాయి. మద్యం ఉత్పత్తి చేయడానికి బేవరేజ్​ కంపెనీలకు 3.9 కోట్ల లీటర్లు, పెప్సీ 3.72 కోట్లు, కోకాకోలకు 4.85 కోట్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అంతేగాక జూబ్లీహిల్స్ లో నివసించే వారికి రోజుకు 60- నుంచి 70 వేల లీటర్లు సరఫరా అవుతున్నాయి. 14 జల మండలి డివిజన్లకు 800 వాటర్ ట్యాంకులు ఉండగా వీఐపీ కాలనీలైన బంజారాహిల్స్, కూకట్​పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, మణికొండ లాంటి వాటికి 175 వాటర్ ట్యాంకులు 
ప్రత్యేకంగా నిర్మించారు. 

నేరాలకు అడ్డాగా మారింది

హైదరాబాద్​ జీవన సంస్కృతిని అధోగతికి తెచ్చే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రధానంగా 41 పబ్బులు ఏర్పాటు చేసి రాత్రి 1 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు వాటిని నడిపేందుకు అనుమతి ఇస్తోంది. 1,400 బార్లను ఏర్పాటు చేశారు. ఎన్​సీఆర్బీ గణాంకాల ప్రకారం మహిళలపై 2017లో 17,521, 2018లో 16,027, 2019లో 18,394 నేరాలు జరిగాయి. షీటీంలు, 1,26,760 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. నైజీరియా ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తూ హైదరాబాద్​ను మత్తులో ముంచుతోంది. కొకైన్, హెరాయిన్, గంజాయి లాంటి మత్తు మందుల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నట్లు? మంగళ్​ హాట్, సీతారాంబాగ్, జూమెరాత్ బజార్, జియాగూడ, అప్పర్ దూల్ పేట, లోయర్ దూల్ పేట డగ్స్​ సరఫరా కేంద్రాలుగా పని చేస్తున్నాయి. నయీం లాంటి నేరగాళ్లను పెంచడానికి ప్రస్తుతం హైదరాబాద్​ వాతావరణం అనుకూలంగా ఉంది. సెటిల్​మెంట్లకు కేంద్రంగా మార్చారు. ప్రభుత్వ ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. లక్షల కేసులు ప్రతిరోజు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇదేనా హైదరాబాద్ విశ్వనగరం? ఏడు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇదేనా? నాలుగు ఐటీ పరిశ్రమలు,  నాలుగు ఫ్లైఓవర్లు కట్టి విశ్వనగరంగా ప్రచారం చేస్తారా? గత అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోకుండా ప్రజలకు కనీస వసతులు, శాంతి భద్రతలు కల్పించాలి. వసతులు కల్పించడంకుండా ఉపాన్యాసాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం అంత మంచిది కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రజలకు అవసరమైన పనులు చేయాలి.

చినుకు పడితే నరకమే

ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా నాలాలపై అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. నాలుగు చినుకులు పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. ట్రాఫిక్​ జాం అవుతోంది. అస్తవ్యస్త పాలసీలు, ఆక్రమణల కారణంగా ఇప్పుడు హైదరాబాద్​ ఈ పరిస్థితులను ఎదుర్కొంటోంది. నాలాలు, చెరువులు కబ్జాల పాలవ్వడంతో నీరు పోయే దారిలేదు. దీంతో వర్షం వస్తే కాలనీలన్నీ చెరువులు, కాల్వలను తలపిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన వరదల కారణంగా వందలాది కాలనీలు నీటమునిగి ప్రజలు సర్వస్వం కోల్పోయారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా వరద బాధితులకు తాత్కాలిక సాయం ప్రకటించిన టీఆర్ఎస్​ సర్కారు.. ఎలక్షన్ల తర్వాత ఆ విషయం మరిచిపోయింది. సాయం అందించలేదు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీంతో ఎప్పుడు వర్షం వచ్చినా కాలనీలన్నీ మునిగిపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదాయం పెరిగినా బతుకు మారలే

2020లో జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలు ఉన్న కార్పొరేషన్ లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. ఒక సీటు ఖాళీగా ఉంది. అయితే పట్టణాభివృద్ధి చూస్తే విశ్వనగరం సంగతి దేవుడెరుగు పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్​ విషయానికొస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నప్పటికీ పట్టణంలో ఏ మూలకు వెళ్లినా దుర్గంధమే కన్పిస్తోంది. సిటీలోని 1,468 మురికివాడల్లో 17.61 లక్షల మంది నివసిస్తున్నారు. ఇందులో 1,131 మురికివాడలను నోటిఫై చేసినా అభివృద్ధి మాత్రం జరగలేదు. 1950లో హైదరాబాద్​ జనాభా 10.96 లక్షలు కాగా, 2000 సంవత్సరంలో అది 53.41 లక్షలకు చేరింది. ప్రస్తుతం కోటి దాటింది. 2030 నాటికి 1.28 కోట్లకు సిటీ జనాభా చేరుతుందని అంచనా. జీహెచ్ఎంసీ 2020-21 బడ్జెట్ రూ.13 వేల కోట్లకు చేరింది. ఇందులో రూ.5,400 కోట్లు రహదారుల కోసం కేటాయించారు. 2015-16లో సిటీ రెవెన్యూ ఆదాయం రూ.2,578 కోట్లు కాగా, క్యాపిటల్ ఆదాయం రూ.3,818 కోట్లుగా ఉన్నది. ఏటా రెవెన్యూ ఆదాయం అనగా ప్రజలపై పన్నులు పెరుగుతూ 2019-20 నాటికి రూ.6,150 కోట్లకు పెరిగింది. నాలుగు సంవత్సరాల్లో ప్రజలపై 120 శాతం పన్నులు పెరిగాయి. అయినా ప్రజల పరిస్థితి మెరుగుపడింది లేదు.

- సారంపల్లి మల్లారెడ్డి,

సోషల్​ ఎనలిస్ట్