Health History : ఓఆర్ఎస్ ఎలా పుట్టింది.. ఆలోచన ఎవరిది.. ఆ చిట్కా ఏంటీ..!

డయేరియా, నీరసం లాంటివి వచ్చినప్పుడు ఓఆర్ఎస్ డ్రింక్ సంజీవనిలా పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. కేవలం వాటికి మాత్రమే కాదు, డీహైడ్రేషన్ కు , కాలిన గాయాలకు, సర్జరీ తర్వాత.. ఇలా చాలా సందర్భాల్లో ఓఆర్ఎస్.. శరీరానికి శక్తినిచ్చి త్వరగా కోలుకునేటట్లు చేస్తుంది. ఇన్ని లాభాలున్న ఓఆర్ఎస్ అసలు ఎలా పుట్టిందో తెలుసా?

ఓఆర్ఎస్ డ్రింక్  గురించి అందరికి తెలుసు. కానీ, దాన్ని ప్రపంచానికి పరిచయలుచేసిన దిలీప్ మహాలనబిస్ గురించి అంతగా తెలియకపోవచ్చు. 1970లో బంగ్లాదేశ్ యుద్ధం టైంలో లక్షలాది మంది శరణార్థులు మనదేశానికి వలస వచ్చారు. ఆ టైంలో శరణార్థ శిబిరాల్లో పెద్ద ఎత్తున కలరా వ్యాపించింది. అక్కడ మంచినీళ్లు, శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడంతో కలరా, డయేరియా బారిన పడి చాలామంది చనిపోయారు. సమయానికిసెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అయిపోయాయి. అప్పుడు దిలీప్ మహాలనబిస్ ఉప్పు, పంచదార కలిపిన నీళ్లను పేషెంట్లకు ఇవ్వమని శిబిరాల్లో ఉన్నవాళ్లకు చెప్పాడు . అవి ఇచ్చిన తర్వాత మరణాల సంఖ్య బాగా తగ్గింది. ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకున్నవాళ్లలో మరణాల రేటు 30 శాతం ఉంటే, ఓ ఆర్ఎస్ తీసుకున్నవాళ్లలో మరణాల రేటు 3 శాతం మాత్రమేఉంది. ఆ తర్వాత నుంచి ఓఆర్ఎస్ కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది.

 గొప్ప ఇన్వెన్షన్

ఓఆర్ఎస్ను 20వ శతాబ్దంలోనే గొప్ప మెడికల్ ఇన్వెన్షన్ చెప్పుకుంటారు. ఓఆర్ఎస్ను కనిపెట్టి సుమారు 50 ఏండైంది. ఇతర మందులతో పోలిస్తే, ఎక్కువమంది ప్రాణాలను కాపాడిన ఔషధం ఓఆర్ఎస్. ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది పిల్లల ప్రాణాలను ఇది సేవ్ చేస్తోంది. డయేరియా వ్యాధి ఉన్న దాదాపు 90 శాతం పిల్లలను ఓఆర్ఎస్ ఒక్కటే కాపాడుతోంది. మిగతా పది శాతం పిల్లలకు మాత్రమే వైద్యం అవసరం అవుతోంది.

 ఇప్పటికీ అదే చిట్కా

దిలీప్ మహాలనబిస్ చిన్న పిల్లల డాక్టర్. కోల్ కతాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో రీసెర్చ్ స్కాలర్గా పనిచేసేవారు. 1966లో దిలీప్ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) ప్రాజెక్టుపై పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ డేవిడ్ ఆర్నలిన్, డాక్టర్ రిచర్డ్ ఏ క్యాష్ తో  కలసి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన చిట్కాను ఇప్పటికీ ఇండ్లల్లో వాడుతున్నారు. నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదార కలిపి ఇవ్వడం చూస్తుంటాం. సింపుల్ చిట్కాగా కనిపించే సంజీవని ఓఆర్ఎస్ గురించి చెప్పిన దిలీప్ మహాలనబిస్ 88 ఏండ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు.

ALSO READ :- రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి.. ఎలా చెక్ చేసుకోవాలి