అమర్ నాథ్ యాత్ర .. ఇది చాలా ప్రాచీన యాత్ర పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణపరమాత్ముడు అమర్ నాథ్ లోని పరమేశ్వరుడి దర్శించుకున్నారని ప్రాచీన గ్రంధాల్లో ఉందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కశ్మీర్ రాజుల వంశాన్ని .. వారి చరిత్రను వివరించే రాజతరంగిణి అనే గ్రంథంలో అమర్ నాథ్ క్షేత్ర ప్రస్తావన ఉంది. అయితే కశ్మీర్ రాజుల పాలన కాలంలో రాణి సూర్యమతి అమరనాథ్ శివుడికి త్రిశూలం, బాణ లింగాలు సమర్పించినట్టు ఆ గ్రంథంలో పేర్కొన్నారు.
హిమాలయ యాత్రల్లో అమర్నాథ్ యాత్ర ప్రముఖమైనది. అమర్నాథ్ కొండగుహల్లో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు శైవులు సాహస యాత్ర చేస్తారు. ఎత్తయిన మంచు పర్వతాలు, దట్టమైన అడవులు, అందమైన మైదానాలు, మనోహరమైన చెరువుల మధ్య సాగే ఈ యాత్ర మధురమైనది. అలాగే సాహసోపేతమైనది కూడా. ఒక పక్క ఎత్తయిన పర్వతం, మరొపక్క లోతైన లోయ ఉండేదారుల్లో సాగే ఈ సాహసయాత్ర ఒక గొప్ప అనుభూతి. ప్రజయభట్టు రాసిన రాజవిప్లతకలో కూడా అమర్నాథ్ యాత్రా విశేషాల ప్రస్తావన ఉంది..
ప్రపంచంలోని అతి పెద్ద గుహల్లో అమర్నాథ్ గుహ ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న గుహ ఇది. దీనిని చూసేందుకు ఏటా ఎంతో మంది యాత్రికులు తరలివస్తున్నారు. శీతాకాలంలో పేరుకుపోయిన మంచు నెమ్మదిగా తొలగిపోతూ అమర్నాథ్ యాత్రకు దారి చూపుతోంది. అమర్ నాథ్ గుహ జూలై, ఆగస్టు మాసాల్లోనే సందర్శకులకు అనువుగా ఉంటుంది. మిగతా మాసాల్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ గుహలో ఏర్పడే మంచులింగం 45 రోజులు మాత్రమే కనిపిస్తుంది.
మే నుంచి ఆగస్టు వరకు గుహలో పైనుంచి బొట్టుబొట్టుగా పడే నీరు ఈ గుహలో మంచురూపంలోకి మారుతుంది. ఈ మంచు శివలింగాకారంలో ఉంటుంది. ఈ కాలంలో కైలాస పర్వతం నుంచి శివుడు ఇక్కడికి వస్తాడని భక్తుల నమ్మకం. ఆ శివుడిని దర్శించుకోవాలని వాళ్ల కోరిక. మృత్యు రహస్యం తెలిసిన శివుడు తన సతి పార్వతికి ఈ గుహలోనే ఆ రహస్యం చెప్పాడట. ఈ గుహలో మంచులింగం పక్కనే రెండు మంచు ఆకారాలు ఏర్పడతాయి. వాటిలో ఒకదానిని పార్వతిగా, మరోదానిని విఘ్నేశ్వరుడిగా భావిస్తారు.
పెహల్గాం: అమర్ నాథ్ కు పెహల్గాం నుంచి కాలినడకన వెళ్లాలి. ఇది అనంతనాగ్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. లిద్దర్ నదీతీరంలో పెహల్గాం ఉంది. ఇది పర్వత పట్టణం. సముద్రమట్టానికి 7,200 మీటర్ల ఎత్తున ఉంది. అమర్నాథ్ యాత్ర మొదలయ్యే ప్రాంతాలలో ఇది ముఖ్యమైనది. అందమైన పచ్చిక మైదానాలకు, దట్టమైన పైన్ అరణ్యాలకు ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం
శేష్ నాగ్ సరస్సు: పెహల్గాంకి 27 కి.మీ దూరంలో శేష్ నాగ్ సరస్సు ఉంది. ఇది సముద్రమట్టానికి 3వేల658 మీటర్ల ఎత్తున ఉంది. అమర్ నాథ్ కు సమీపంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో శేషనాగ్ సరస్సు ఒకటి. పెహల్గాం నుంచి కాలి నడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు శీతాకాలమంతా గడ్డకట్టి ఉంటుంది. జూన్ నెల ముగిసిన తర్వాత మంచు కరిగిపోతుంది.
బొటానికల్ గార్డెన్ (కొకెర్నాగ్): అనంతనాగు 10కి.మీ దూరంలోని కౌబెర్నాగ్ లో ఉన్న బొటానికల్ గార్డెన్ ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో లక్షల చెట్లు ఉన్నాయి. కొన్ని వందల రకాల వృక్ష జాతులు ఈ గార్డెన్లో ఉన్నాయి! ఇక్కడ దేశీయ, విదేశీ వృక్ష జాతులను చూడొచ్చు. కొండల మధ్య ఉండే విశాలమైన ఈ బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు వినోదమే కాదు విజ్ఞానాన్నీ ఇస్తుంది.