వచ్చిన తెలంగాణలో ఎదిగిందెవరు? : కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి

వచ్చిన తెలంగాణలో ఎదిగిందెవరు? : కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి

ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే, సహజంగానే ఆ రాష్ట్ర పరిధిలోని నీళ్లు, నిధులు, నియామకాలు వాటంతటవే దక్కుతాయి.   కానీ వచ్చిన రాష్ట్రంలో  అక్కడి ప్రజలు ప్రతి రంగాన్ని శాసించే స్థితిని కల్పించడమే .. చారిత్రక అన్యాయాలు జరిగిన తెలంగాణ వంటి రాష్ట్రానికి అసలైన సార్థకత. ఏరంగంలోనూ చెప్పుకోదగ్గంతగా తెలంగాణ వాళ్లు లేకపోవడానికి, మిగతా దేశంతో పోలిస్తే తెలంగాణ వాళ్లు వెనుకబడి ఉండటానికి  కారణాలు తెలియనివేమీ కావు.  400 ఏండ్లు కుతుబ్​షాహీలు, ఆసిఫ్​జాహీల పాలన. 59 ఏండ్లు ఉమ్మడి పాలకుల పాలన. వెరసి విద్యలో వెనుకబాటుతనం, తద్వారా  పారిశ్రామికరంగం, వ్యాపారరంగం తోపాటు ఆయా రంగాలలో తెలంగాణ ముద్ర కనిపించకపోవడం సుస్పష్టం. అందుకే దేశంలో తెలంగాణ  ప్రజలది ప్రత్యేక సమస్య. చారిత్రక అన్యాయాలు భరించి తెచ్చుకున్న రాష్ట్రమిది. అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్లు ఎదిగివచ్చి  పోటీ ప్రపంచంలో నిలబడాలని ఆశించిన తెలంగాణ ఇది!  కాబట్టి ఇది ప్రాంత దురభిమానంతో చెప్పుతున్న సమస్య కాదు. మిగతా దేశంతో సమానంగా ఎదిగే అవకాశాలను దశాబ్దాల తరబడి కోల్పోయిన ప్రాంతంగా చూస్తేగానీ,అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్లు ఎందుకు ఎదిగిరావాలంటున్నామో అర్థమవుతుంది.

పాత కాపులను పోషించారు

వచ్చిన తెలంగాణలో ప్రతి రంగంలో తెలంగాణ వాళ్లు ఎదిగివస్తారని భావించాం.  కానీ  కేసీఆర్ సర్కారు ​ ఏనాడైన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసిందా? సరికదా.. ఆయా రంగాలలో సీమాంధ్రకు చెందిన పాత కాపులనే పెంచిపోషించింది. ఎనిమిదేండ్లలో ఏయే రంగంలో తెలంగాణ వాళ్లు ఎదిగివచ్చారో  చెప్పడానికి ఇవాళ  కేసీఆర్​ దగ్గర లెక్కలు లేవు!  కొన్ని విషయాలు చెప్పడానికి సిల్లీగానే కనిపించవచ్చు!  కానీ ఒక పాలకుడి పాలనా ఉద్దేశాలు చిన్నపాటి నిర్ణయాలలోనే తెలిసిపోతాయి. ఉదాహరణకు, తెలంగాణ చేనేత ఎంబసిడర్​గా సినీ హీరోయిన్​ సమంతను నియమించిన విషయం తెలిసిందే. కానీ  కళారంగంలో  కొనసాగుతున్న ఏ తెలంగాణ అమ్మాయి అయినా కేటీఆర్​కు ఎందుకు గుర్తుకు రాలేదో!  యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం పర్యవేక్షకుడిగా, ఆగమశాస్త్ర పండితుడిగా జీయర్​ స్వామిని నియమంచారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంలో ఆగమశాస్త్ర ఆచరణ, పర్యవేక్షణ  ఒక తెలంగాణ బ్రాహ్మణ పండితుడు చేయలేడా? జీయర్​  స్వామే  చేయగలరా?  వచ్చిన తెలంగాణలోనూ  ఆంధ్రా స్వామీజీలే తప్ప, సగటు తెలంగాణ బ్రాహ్మణులు ప్రాచుర్యంలోకి రావాలని ఎందుకు కోరుకోలేకపోయారు? హైదరాబాద్ తెలుగు​ ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడ్డ ఆంధ్రా ప్రముఖులకు, నటులకు  భూములు, ప్రభుత్వ సబ్సిడీలు బాగానే దానాలు చేశారు, దోస్తానాలు పెంచుకున్నారు! కానీ ఫిలిం ఇండస్ట్రీలో నటులుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా ఎంతమంది తెలంగాణ వాళ్లు కొత్తగా ప్రవేశించారు? ఓవైపు సెటిలర్స్​ ఓట్ల వేటలో పడ్డారు. మరోవైపు సినీ రంగంలో, పరిశ్రమల రంగంలో సీమాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముకాశారు.

మనం గర్వించదగ్గ కాంట్రాక్టర్​ 

14 ఏండ్ల ఉద్యమ కాలమంతా  ‘సీమాంధ్ర పెట్టుబడిదారులు’ తెలంగాణను దోచుకుపోతున్నారని చెప్పి.. ఇవాళ లక్ష కోట్ల కాళేశ్వరం, 40 వేల కోట్ల మిషన్​ భగీరథ, 40వేల కోట్ల పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టులను అదే సీమాంధ్ర పెట్టుబడిదారుడికి అప్పగించిన కేసీఆర్, ఆయన అనుచరులు.. రాజగోపాల్​రెడ్డి కేంద్రంలో  వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయాడనడం ఒక వింత! నిజానికి ఝార్ఖండ్​ రాష్ట్రంలో ఓపెన్​ కాస్ట్ మైనింగ్​ కాంట్రాక్టు 25 ఏళ్ల పాటు చేయాల్సిన​ పని అది! అదేదో వేల కోట్లు ఆయనకు కేంద్రం అప్పనంగా ఇచ్చేసినట్లు దుష్ప్రచారానికెత్తుకున్నారు.  అలాంటి అరాచక రాజకీయాన్ని  ప్రజలు  ఎప్పుడూ నమ్మరు.  1986 నుంచే రాజగోపాల్​ రెడ్డి కాంట్రాక్టు రంగంలో ప్రవేశించారు.  అంచెలంచెలుగా పెద్ద కాంట్రాక్టర్​గా ఎదిగారు. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మైనింగ్​ రంగాల్లో   దేశం మెచ్చే స్థాయిలో ఆయన కంపెనీ పనిచేసింది. చైనా సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో దేశ భద్రతా పరంగా వ్యూహాత్మకమైన, అత్యంత కీలకమైన 357  కి.మీ. జాతీయరహదారులు నిర్మించారు.  చైనా సైనిక చొరబాట్ల ఉద్రిక్తతల నడుమ  దేశ సరిహద్దుల్లో ప్రమాదాలకు భయపడకుండా  రోడ్డు నిర్మాణాలు చేసిన  రాజగోపాల్​రెడ్డిని ఎవరైనా ప్రశంసించాల్సిందే. ఆయనను విమర్శించే నైతికత .. సీమాంధ్ర కాంట్రాక్టర్లను పెంచిపోషించిన  కేసీఆర్​ కు, ఆయన అనుయాయులకు ఉందా? రాజగోపాల్​రెడ్డి తెలంగాణ గర్వించదగ్గ కాంట్రాక్టర్​.  దేశం గర్వించదగ్గ కాంట్రాక్టర్​.  గడువులోగా, నాణ్యమైన రహదారి నిర్మించి అందించినందుకు దేశ ప్రధాని   సైతం ఆయన కంపెనీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రశంసించడం గమనార్హం. నిజానికి అరుణాచల్​ ప్రదేశ్​లో నిర్మించిన ఆ జాతీయ రహదారిలో పెద్దగా లాభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా  కంపెనీ  కాంట్రాక్ట్​  పని తీరును దేశానికి ఆదర్శంగా  చూపించాలనే ఆసక్తే  ఆయనలో ఎక్కువగా  ఉండిందని విన్నాం.  ఆయా రంగాల్లో తెలంగాణ  ఎదిగిరావడానికి రాజగోపాల్​ రెడ్డి లాంటి వాళ్లు ఖచ్చితంగా ఆదర్శప్రాయులు.   తెలంగాణ వాళ్లను ఎందుకు ఎదగనీయడంలేదో  ప్రజలకు జవాబు చెప్పని కేసీఆర్.. ​రాజగోపాల్​రెడ్డిపై  ఏ ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించరు. కేసీఆర్​ సర్కారు ఎదిగించింది సీమాంధ్ర పెట్టుబడిదారులను, నిందిస్తున్నది తెలంగాణ వాళ్లను. ఇదీ తెలంగాణ ఎదుగుదలను అణగదొక్కిన కేసీఆర్​ పాలనాతీరు! వచ్చిన తెలంగాణలో ఎదిగింది ఆయన పరివారమా లేక తెలంగాణ అనేది ప్రజలకు తెలిసిందే!

ఏ రంగంలో నైనా ఎదిగామా?

ఎడ్యుకేషన్​ రంగంలో, హెల్త్​ రంగంలో, కాంట్రాక్ట్​లలో , మైనింగ్​లో, ఎక్కడైనా  తెలంగాణోళ్ల ముద్రను కేసీఆర్​ తెచ్చారా? మంత్రుల పేషీలలో, సెక్రటేరియెట్​లో, మోతెబరి సీమాంధ్ర పెట్టుబడిదారులకు లభించే  గౌరవం, సగటు తెలంగాణ వాడికి లభించిందా? మిషన్​భగీరథ కాంట్రాక్టరు అతి  తక్కువ మార్జిన్​తో తెలంగాణ సబ్​కాంట్రాక్టర్లకు పనులు అంటకడితే, వారంతా కేసీఆర్​ కు మొర పెట్టుకోవడానికి  వెళ్లితే  సీఎం అపాయింట్​మెంట్​ ఇవ్వలేదని సబ్​ కాంట్రాక్టర్లే చెప్పారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, పాలమూరు, అనేక మేజర్​, మీడియం, మైనర్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుల కాంట్రాక్టులే కాకుండా ప్రతి చిన్నా, పెద్ద కాంట్రాక్టులు ఎనిమిదేండ్లలో  ఎవరికి కట్టబెట్టారో అందరికీ తెలుసు! సుమారు 3లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు అప్పనంగా ఇతరులకు అప్పగించారు.  అందులో సబ్​కాంట్రాక్టు పనులన్నా తెలంగాణ వాళ్లకుఏమేరకు దక్కాయి? ఒకవేళ ఎవరికైనా దక్కినా అది  ‘మేగా’ కంపెనీ దయా దాక్షిణ్యాలపై దక్కిఉండొచ్చు తప్ప  కేసీఆర్​ సర్కారు దయ వల్ల మాత్రం కాదు. సగటు తెలంగాణ  సబ్​ కాంట్రాక్టర్ల​ను అడిగితే తమ ఆవేదన ఏమిటో కళ్లకు కట్టినట్లు ఇప్పటికీ  చెపుతున్నారు.  ఉన్న తెలంగాణ సబ్​ కాంట్రాక్టర్లనే వేధించుకుతిన్నారు. ఇక తెలంగాణోడు పెద్ద కాంట్రాక్టర్​గా ఎదిగివస్తాడని ఎవరు ఆశిస్తారు?  వాస్తవానికి  తెలంగాణ సబ్​ కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తే వాళ్లంతట వాళ్లే బడా కాంట్రాక్టర్లుగా ఎదిగివచ్చేవారు కాదా?  మేగాలు, రావులు వంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లలతో కేసీఆర్​ పరి​పాలన ఎనిమిదేంఢ్లు  ఫుల్​  ఎంజాయ్​ చేసింది, చేస్తున్నది. వచ్చిన తెలంగాణ తన కోసం తప్ప, తెలంగాణ ప్రజల ఎదుగుదల కోసం కాదన్న  ఆయన భావనే తెలంగాణక ఒక శాపమైంది.

తెలంగాణోళ్లకు వేదింపులు

తెలంగాణ రాక ముందు ఆయా రంగాల్లో  స్వయంశక్తితో  ఎదిగివచ్చిన  తెలంగాణ వాళ్లు కొందరైనా  ఉన్నారు. అలాంటి కొందరు తెలంగాణ పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను కనీసం ఆదరపూర్వకంగానైనా కేసీఆర్​ సర్కార్​ చూడలేకపోయింది.  సరికదా, వారి పట్ల రాజకీయ రాగద్వేషాలతో వ్యవహరించడం మరొక దారుణం. అలాంటి కాంట్రాక్టర్లు   చేసిన ప్రభుత్వ కాంట్రాక్టు పనుల బిల్లులు మంజూరు చేయకుండా ఏండ్ల తరబడి ఆపేయడం, వేధించడం పరిపాటిగా మారిందని విన్నాం.   తెలంగాణ కాంట్రాక్టర్ల బిల్లులు  ఆగుతాయి,అగవచ్చు!   కానీ  కాళేశ్వరం  బడా కాంట్రాక్టర్​ బిల్లులు మాత్రం ఆగవు! సీమాంధ్ర కాంట్రాక్టర్ల పట్ల ప్రేమ, తెలంగాణ కాంట్రాక్టర్ల పట్ల వివక్ష పాటించిన కేసీఆర్​ నుంచి తెలంగాణ ఎదుగుదలను ఏమని ఆశించగలం?

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి
సీనియర్​ జర్నలిస్ట్