- రేసులో మైనారిటీ నేత షబ్బీర్అలీ
- రేవంత్‌రెడ్డి కోసం కామారెడ్డి వదులుకున్న సానుభూతి
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే విషయం హాట్‌టాపిక్ గా మారింది. సీనియర్ నేత, బోధన్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి బెర్తు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోసం కామారెడ్డి వదులుకొని అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిన షబ్బీర్అలీని మంత్రివర్గంలో తీసుకోవచ్చనే చర్చ ఉత్కంఠను కలిగిస్తోంది. పార్టీలో మైనారిటీ వర్గానికి చెందిన ముఖ్య నేత కావడంతో ఆయన పేరును ప్రతిపాదనలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నారు.
తెరపై షబ్బీర్ పేరు కూడా..
సుదర్శన్‌రెడ్డితో పాటు మైనారిటీ నేత షబ్బీర్అలీకి కూడా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కామారెడ్డి లోకల్‌కు చెందిన ఆయన ఎలక్షన్‌లో అక్కడే పోటీ చేయాల్సింది. కానీ అధిష్ఠానం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోసం సెగ్మెంట్ వదులుకొని నాన్‌లోకల్ నియోజకవర్గమైన అర్బన్ నుంచి పోటీ చేశారు. నామినేషన్ వేశాకే ప్రచారం షురూ చేసిన ఆయన 59,853 ఓట్లతో రిజల్ట్ తో రెండో స్థానంలో నిలిచారు. పార్టీ కోసం నాన్‌లోకల్ సెగ్మెంట్‌కు వచ్చి ఓటమి చెందిన షబ్బీర్‌పై సానుభూతి ఉంది.
1989, 2004లో రెండు సార్లు గెలిచినప్పుడు మంత్రిగా పనిచేశారు. విద్యార్థి నేతగా కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన పార్టీలో అంచలంచెలుగా పదవులు నిర్వహించారు. మైనారిటీ వర్గానికి చెందిన షబ్బీర్‌ను పార్టీ కూడా గౌరవించింది. అధికారంలో లేని సమయంలో ప్రతిపక్ష నేత హోదాలోని శాసనమండలి పక్షం లీడర్ బాధ్యతలో కొనసాగించింది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా సంబంధాలున్న షబ్బీర్అలీకి మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తారనే టాక్ నడుస్తోంది.
సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి..
బోధన్ నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలతో హాట్రిక్ కొట్టారు. అయితే పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్‌లో మంత్రిగా పనిచేశారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. 1989, 2014, 2018 ఎలక్షన్స్‌లో మూడుసార్లు ఓటమి చెందారు. జిల్లాలో సీనియర్ లీడర్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి దగ్గరి బంధువు.
మొన్నటి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్ సుదర్శన్‌రెడ్డి గెలిస్తే మంత్రిగా సేవలందిస్తారని ప్రకటించారు. జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సీనియర్ కావడం, ఒక దఫా మంత్రిగా పనిచేసిన అనుభవానికి తోడు రేవంత్‌రెడ్డితో బంధుత్వంతో బుగ్గకారును దాదాపు ఖారారు చేసే పరిస్థితి ఉంది. ఆయనకు కేటాయించే శాఖను కూడా కన్ఫర్మ్ చేశారనే ప్రచారం నడుస్తోంది.