లైంగిక వ్యాధులతో..నిమిషానికి ఐదుగురు బలి : డబ్ల్యూహెచ్ఓ

లైంగిక వ్యాధులతో..నిమిషానికి ఐదుగురు బలి : డబ్ల్యూహెచ్ఓ
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది మృతి
  • అమెరికా, ఆఫ్రికాలోనే ఎక్కువ మంది బాధితులు 
  • ఐదేండ్ల తర్వాతే మెడిసిన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి 
  • కొత్త కేసుల వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌‌ఓ ఆందోళన 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లైంగిక వ్యాధుల సంక్రమణ కేసులు (సెక్స్ వల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్స్–ఎస్టీఐ) భారీగా పెరుగుతున్నాయి. హెచ్ఐవీ, వైరల్ హెపటైటిస్, సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్ -వంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రోగాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌‌ఓ) నివేదిక హెచ్చరించింది. అంటే గంటకు 285 మంది,  నిమిషానికి సగటున ఐదుగురు ఈ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

 అయితే, లైంగిక వ్యాధుల కేసుల పెరుగుదల అమెరికా, ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉన్నదని డబ్ల్యూహెచ్‌‌ఓ వెల్లడించింది. ముఖ్యంగా ట్రెపోనెమా పాలిడమ్ బ్యాక్టీరియా వల్ల సోకే సిఫిలిస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. ఇన్ఫెక్షన్ ఉన్న సూదులు, ఇంజక్షన్ల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా  సోకే ప్రమాదం ఉంది. గర్భం ధరించిన మహిళకు సిఫిలిస్ సోకితే కడుపులోని బిడ్డకు కూడా వ్యాపిస్తుంది. ఎక్కువ కాలం పాటు దీనికి చికిత్స చేయించకుండా వదిలేస్తే గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి సిఫిలిస్ సోకితే కనిపించే లక్షణాల గురించి అవగాహన పెంచుకోవాలని డబ్ల్యూహెచ్‌‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ సూచించారు. 

2030 నాటికి పూర్తిస్థాయి చికిత్స 

సెక్స్ వల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కు పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ఇంకా అందుబాటులోకి రాలేదని టెడ్రోస్ తెలిపారు. 2030 నాటికి  లైంగిక వ్యాధుల ఇన్‌‌ఫెక్షన్ కేసులకు మెడిసిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నాలుగు సాధారణ ఎస్టీఐలు(సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్) వేగాంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల రోజూ  10 లక్షల కొత్త ఇన్ఫెక్షన్‌‌లు వస్తున్నాయని వివరించారు. 

‘హెపటైటిస్–బీ’తోనే డేంజర్

చికిత్సలు ఉన్నప్పటికీ హెపటైటిస్ బీ, సీ కొత్త కేసులు ఎక్కువగానే ఉన్నాయి. వైరల్ హెపటైటిస్ వల్ల మరణాలు కూడా పెరుగుతున్నాయి.  2019లో హెపటైటిస్ వల్ల 11 లక్షల మంది చనిపోగా.. 2022 నాటికి ఈ సంఖ్య 13 లక్షలకు పెరగింది. వీరిలో 11 లక్షల మంది హెపటైటిస్ బీ వల్లే చనిపోయారు. కాగా, హెచ్‌‌ఐవీ కేసులు, మరణాలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. అయినప్పటికీ, 2022లో 6.30 లక్షల హెచ్ఐవీ మరణాలు సంభవించాయని పేర్కొంది. హెచ్‌‌ఐవీ బాధితులుగా మారుతున్న వారిలో 13 శాతం మంది 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే కావడం ఆందోళనకరమని తెలిపింది.