వస్తు ఉత్పత్తిలో శ్రామికుడి కృషికి సమానంగా లాభాల్లోనూ భాగముండాలని, శ్రామికుడు, పెట్టుబడిదారుడు అనే రెండు వర్గాలు కలిసిపోయి వర్గ రహిత సమాజం ఏర్పడాలనేది అంతిమ లక్ష్యం. అయితే అలాంటి సమాజాన్ని స్థాపించేందుకు శ్రామికులంతా ఒక్కటై దోపిడీ వ్యవస్థను కూలదోయాలి. ప్రపంచ దేశాల్లో అక్కడక్కడా కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన యుద్ధాలు విజయవంతమై ఆయా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కమ్యూనిజం గమనానికి భిన్నంగా మరోవైపు 20వ శతాబ్దం ఆరంభం నుంచి పారిశ్రామిక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత పెరిగింది. క్రమంగా ఆధునిక మధ్యతరగతి ఆర్థికంగా బలపడింది. యంత్రాల ఆవిష్కరణతో కార్మికుల చేతుల్లోంచి ఉత్పత్తి జారిపోతున్నది. మనిషికి ఇచ్చే కూలి కన్నా తక్కువ వ్యయంతో పనిచేసే రోబోలు వచ్చాయి. అభివృద్ధిలో పోటీ పడేందుకు కమ్యూనిస్టు దేశాలు కూడా పెట్టుబడి బాటలో నడుస్తున్నాయి. అయితే ఈ మార్పులన్నీ ఆయా దేశాల్లో పాలకుల ప్రాబల్యంతో వచ్చినవే తప్ప కమ్యూనిజం సిద్ధాంతానికి, సూత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతం అలాగే ఉంది. కమ్యూనిస్టు అనే పదానికి అర్థం మారలేదు.
సభ్యత్వంతోనే కమ్యూనిస్టు అయిపోరు!
దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. వాటిలో సభ్యత్వముండగానే ఎవరూ కమ్యూనిస్టు అయిపోరు. ఆ సిద్ధాంతాన్ని ఆచరణబద్ధంగా అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో పాటించలేకపోతే ఎవరైనా నిజాయితీగా తాను కమ్యూనిస్టును కాను కేవలం ఆ పార్టీ సభ్యుడిని అని మాత్రమే చెప్పుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు పార్టీ నియమాలకు బద్ధుడైనా వ్యక్తిగత జీవితాచరణ కొంతమేరకు ఆయన ఇష్టం. ఈ మధ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఒక దేవాలయంలో మొక్కులు చెల్లించుకొని, పూజారితో ఆశీర్వచనాలు తీసుకొని ‘దేవుళ్లకు కమ్యూనిస్టు వ్యతిరేకులు కారని, తామూ భగవంతుడిని నమ్ముతామని’ అన్నట్లు పత్రికల్లో వచ్చింది. ఆయన మాటల ప్రకారం ఇది తమ పార్టీ విధానం అన్నట్లుగా అర్థం వస్తోంది. దేవుడు ఒక ఊహాజనితం అని భావించే కమ్యూనిస్టు ప్రాథమికంగా నాస్తికుడు, హేతువాది, మహిమలను నమ్మని తర్కబద్దుడు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి నోట వచ్చిన ‘కమ్యూనిస్టులు దేవుణ్ని నమ్ముతారు’ అనే మాటలు ఆశ్చర్యం గొల్పాయి. అయితే ఆయన సూత్రీకరణ వ్యక్తిగతమా లేక పార్టీ నియమావళియా అనేది స్పష్టం కావాలి. అసలు ఆయన దృష్టిలో కమ్యూనిస్టులంటే కేవలం సీపీఐ సభ్యులా లేక కమ్యూనిజాన్ని ఆచరించే వారందరా అనేది తేలాలి. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా తనకు భగవంతుడిపై విశ్వాసముందంటే కొంతవరకు సర్దుకోవచ్చు. ఆయన వ్యాఖ్యపై ఇంతవరకు సీపీఐ ఎలాంటి స్పష్టత ఇయ్యకుండా మౌనం వహిస్తున్నది. చాడ మాటల్ని పార్టీ తమ విధానంగా అంగీకరిస్తే పార్టీ ఆఫీసుల్లో దేవుడి గదిని పెట్టించాల్సి ఉంటుందేమో! మేము మతోన్మాదులకు వ్యతిరేకం తప్ప సాధారణ మతవాదులకు కాదని చాడ అన్నారు. మతం మనుషులను విడదీస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని, పార్టీకి ఉండే గతితార్కిక పద్ధతిని ఆయన పూర్తిగా విస్మరించారు.
రంగులు పూసుకుంటూ..
చాడ వెంకట్ రెడ్డి మతాన్ని ఆచరించే సాధారణుడిగా కొనసాగవచ్చు. అది ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. దేవుళ్లకు ‘కమ్యూనిస్టులు’ వ్యతిరేకం కాదు అనే మాటనే సర్వాంగీకారం కాదు. ఆ మాట కమ్యూనిస్టు భావజాలానికే మచ్చ లాంటిది. సిద్ధాంత నియమాల ప్రకారం తాను కమ్యూనిస్టునా? కదా ? అనేది కూడా ఆయన తేల్చుకోవాలి. దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న దశలో ఈ మాటలు ప్రజల్లో, పార్టీ పట్ల, నమ్మకాన్ని మరింత దెబ్బ తీస్తాయి. ప్రత్యేకంగా తెలంగాణలోని సీపీఐ నిర్ణయాలన్నీఈ మధ్య రాజకీయ ప్రయోజనాన్ని ఆశించేలా ఉంటున్నాయి. తమ చేతుల్లో వెలిసిపోతున్న ఎర్రజెండాకు పసుపు, గులాబీ రంగులు పూసి దాని రంగేంటో తెలియకుండా చేస్తున్నారు. దీనికి తోడు చాడ వారి శఠగోపం మరింత పలుచన చేస్తున్నది. మీ పార్టీ పేరెలా ఉన్నా కమ్యూనిస్టు అనే పదాన్ని వాడే అర్హత కోల్పోతున్నారేది చారిత్రక సత్యం.
- బి. నర్సన్,
సోషల్ ఎనలిస్ట్