Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్

బిగ్ బాస్ 16 కంటెస్టెంట్, సోషల్ మీడియా సంచలనం అబ్దు రోజిక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. జూలై 7న తన ప్రేయసి అమీరాతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం అతనికి 20 ఏళ్ళు కాగా.. వధువు వయసు 19 ఏళ్ళు మాత్రమే.  

అబ్దు నిశ్చితార్థపు వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. మరో ఫోటోలో ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగినట్లు ఉంది. అతనికి కాబోయే భార్య పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఆమె పూర్తి ఫోటో రివీల్ చేయలేదు.

ఎవరీ అమీరా..?

అబ్దుకు భార్య కాబోయే అమీరా. వయస్సు 19 సంవత్సరాలు. షార్జాలో నివస్తోంది. ప్రస్తుతం ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతోంది. అబ్దు, అమీరా మొదటిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ లోని ఒక మాల్‌లో కలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి.. పెళ్లి దాకా తీసుకొచ్చింది. 

కాబోయే భార్యపై అబ్దు ప్రశంసలు కురిపించాడు. "నా జీవితంలో ప్రేమ కంటే విలువైనది మరొకటి లేదు. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. అమీరా, నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. నాకు 20 ఏళ్లని అందరికీ తెలుసు. ప్రేమలో పడాలని, నన్ను ఎక్కువగా గౌరవించే, ప్రేమించే అమ్మాయిని దక్కాలని కలలు కన్నాను. అనుకున్నట్లుగానే అమీరా దొరికింది. ఆమె అందంగా ఉంటుంది. పొడవాటి జుట్టు, అందమైన కళ్ళు ఉన్నాయి. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నా.. జూలై 7 తేదీని సేవ్ చేయండి !! .." అని రోజిక్ తన ప్రేమను వ్యక్త పరిచాడు.