IRS Officer: పురుషుడిగా మారిన IRS అధికారిణి.. దేశ చరిత్రలోనే తొలిసారి

IRS Officer: పురుషుడిగా మారిన IRS అధికారిణి.. దేశ చరిత్రలోనే తొలిసారి

తెలంగాణ కేడర్‌కు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారిణి తన పేరు, లింగం మార్చుకొని వార్తల్లో నిలిచారు. భారత సివిల్ సర్వీసెస్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. పుట్టుకతో మహిళగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించగా.. అందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. 

నివేదికల ప్రకారం, చెన్నెకి చెందిన మహిళా ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్(CESTAT)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తన పేరును అనుకతిర్‌ సూర్యగా, లింగాన్ని మహిళకు బదులుగా పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎవరీ అనుకతిర్ సూర్య..?

అనుకతిర్ సూర్య అలియాస్ అనసూయ.. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆపై 2023లో నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. 

డిసెంబర్ 2013లో తమిళనాడులోని చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అనంతరం 2018లో డిప్యూటీ కమిషనర్ హోదాకు పదోన్నతి పొందారు. గతేడాది తెలంగాణలోని హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడే హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.