ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ రాజకీయ ప్రస్థానం ఇది.. ఆమె మొత్తం ఆస్తి ఎంతంటే..

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ రాజకీయ ప్రస్థానం ఇది.. ఆమె మొత్తం ఆస్తి ఎంతంటే..

న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి ఆతిశీ మర్లెనా సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ పరిణామంతో ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ పేరు ఖరారైంది. ఆప్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఆతిశీ పని చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఢిల్లీ స్టూడెంట్లకు మెరుగైన విద్యనందించాలన్న ఆప్ టార్గెట్కు అనుగుణంగా 43 ఏండ్ల ఆతిశీ పని చేశారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపించారు. కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేశారు. ఆతిశీ అడ్వకెట్ కూడా కావడం విశేషం. పర్యావరణ సమస్యలకు సంబంధించిన పలు కేసుల పరిష్కారానికి ఆమె కృషి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

ఇంత ఉన్నత విద్యావంతురాలు కావడంతో మనీశ్ సిసోడియా రాజీనామా అనంతరం విద్యా శాఖను ఈమె చేతిలో పెట్టారు. స్వతహాగా అడ్వకేట్ కావడంతో సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత న్యాయ శాఖ బాధ్యతలు కూడా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆతిశీకి అప్పగించారు. ఇక.. నీతినిజాయతీల విషయానికొస్తే.. ఆతిశీకి పాలనపరంగా మంచి పేరే ఉంది. ఆమెపై పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేవు. ఆమె సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.. ఆతిశీ మొత్తం ఆస్తి కోటీ 41 లక్షలు.