బీజేపీ పేరు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మను ప్రకటించింది. బీజేపీశాసనసభా పక్ష సమావేశంలోఈ నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బ్రహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. ప్రస్తుతం ఈయన బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భజన్‌లాల్ శర్మ సంగనేర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వాస్తవానికి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ లాహోటీని కాదని అధిష్టానం భజన్‌లాల్ శర్మకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సీఎం రేసులో వసుంధర రాజే పాటుగా తొమ్మిది మంది అగ్రనేతలు పోటీలో ఉన్నప్పటికీ అసులు పోటీలోలేని భజన్‌లాల్ శర్మ పేరును అధిష్టానం ఖరారు చేసింది. నమ్మకం, విధేయతే వల్లే శర్మకు సీఎం పదవి వరించిందని తెలుస్తోంది.
56 ఏళ్ల భజన్‌లాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు సార్లు పనిచేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ప్రకటించిన ఆస్తులు రూ. 1.5 కోట్లు, ఇందులో రూ. 43.6 లక్షల చరాస్తులు, రూ. కోటి స్థిరాస్తులు ఉన్నాయి. ఇక రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను అధిష్టానం నియమించింది. అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా వాసుదేవ్ దేవ్‌నానీ నియమితులయ్యారు.
రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగిన 199 స్థానాలకు గాను బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది. రాజస్థాన్ జనాభాలో 7 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొత్తవారికే సీఎంగా అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం.