- రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి
- బీజేపీ నుంచి ఎనిమిది మంది గెలుపు
- గెలిచినోళ్లలో ఆరుగురు కొత్తవాళ్లే..
- రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యేలుగా అనుభవం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభాపక్ష నేత పదవి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో పోటీ పెరిగింది. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఫ్లోర్ లీడర్ పదవికి డిమాండ్ ఏర్పడింది. దీని కోసం రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు మధ్యే పోటీ కొనసాగుతున్నది. ఇంతకు ముందు బీజేపీ ఫ్లోర్ లీడర్ గా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడంతో ఈ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఫస్ట్ టైమ్ గెలిచినవారే ఉన్నారు. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యేలుగా పని చేసిన అనుభవం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ సీనియర్. అయితే, ఆయనకు తెలుగుపై పట్టు లేకపోవడం, హిందుత్వంపై తప్ప ఇతర అంశాలపై అంతగా అవగాహన లేకపోవడం కొంత మైనస్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సిటీ లీడర్లకే పదవులా అని చర్చ!
ఎల్పీ లీడర్ పదవి కూడా రాజాసింగ్ కే ఇస్తే.. హైదరాబాద్ సిటీ వాళ్లకే అన్ని పదవులా? అనే అపవాదును పార్టీ మూటగట్టుకునే అవకాశం ఉంటుందని ఓ వర్గం అభిప్రాయపడుతున్నది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. హైదరాబాద్ సిటీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ కు పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ పదవి దక్కింది. దీంతో ఎల్పీ పదవి ఈసారి హైదరాబాద్ సిటీ బయటి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు ఇచ్చే ఆలోచన బీజేపీ పెద్దలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నలుగురు గెలుపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. ఇప్పుడు రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నుంచి భారీ మెజార్టీతో మహేశ్వర రెడ్డి గెలిచారు. దీంతో ఎల్పీ లీడర్ పదవిపై ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో తమ జిల్లాకే ఎల్పీ పదవి ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
నిజామాబాద్ నుంచి ముగ్గురి విజయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వెంకట రమణా రెడ్డి (కామారెడ్డి) మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, అటు సీఎం కేసీఆర్ ను.. ఇటు కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈయన కూడా ఎల్పీ లీడర్ రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్నికల ఫలితాలపై జాతీయ నేతలకు వివరిస్తున్నారు. ఇదే టైమ్లో ఎల్పీ లీడర్ విషయంపై కూడా చర్చకు రానుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే బీజేపీ ఎల్పీ సమావేశం జరగనుందని, అందులో ఎల్పీ లీడర్ పదవిపై ఓ క్లారిటీ రానుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.