ఆధ్యాత్మికం: బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు.. ఎలాంటి లక్షణాలుంటాయి..

ఆధ్యాత్మికం: బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు..  ఎలాంటి లక్షణాలుంటాయి..

బ్రహ్మ జ్ఞాని అంటే ఎవరు.. ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. బ్రహ్మ జ్ఞానిని ఎలా గుర్తించాలి.. ఈ విషయంలో శ్రీకృష్ణుడు ఏం భక్తులనుద్దేశించి ఏం  చెప్పాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

భగవంతుడు అందరికీ మిత్రుడు, రక్షకుడు, దీన్ని గుర్తించే వాడు భక్తుడు... బ్రహ్మ జ్ఞాని..అతడు నిశ్చింతగా ఉంటాడు. అలాంటి వ్యక్తే సర్వప్రాణ కోటికీ  మిత్రుడు అని  తెలిసినవాడు శాంతి పొందుతాడు. అయితే   ఈ మాటలో చాలా లోతుగా అర్దం ఉంది.  నన్ను మిత్రునిగా పొందినవాడు అనకుండా,  నేను మిత్రుడనని తెలిసినవాడు.. అనడమే గొప్పమాట. భగవంతునికి మనతో ఉన్న మిత్రత్వంస్వాభావికం, శాశ్వతం. దాన్ని గుర్తించేవాడే తెలివైనవాడు... అలాంటి వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరు. 

తలుపులన్నీ తెరచి, కళ్ళు తెరచినవాడే సూర్యుని వెలుగును చక్కగా పొందగలడు. కళ్ళు మూసుకొని, గదిలో ద్వారాల్నీ మూసుకు కూర్చున్నవారు సూర్యుడు వెలుగును చూడలేరు కదా.. అని సూర్యుడు తన వెలుగును ప్రసరించచేయడం మానుకోడు.  అలాగే బ్రహ్మజ్ఞాని కూడా ఎవరు ఏమన్నా.. చాలా శాంతంగా.. ఆధ్యాత్మికంగా తన జీవిత పర్యంతం పరమేశ్వరుని ధ్యానంలో గడుపుతాడు.

 ప్రపంచమంతా భగవంతుని ప్రేమ విస్తరించి ఉంటుంది.  అందరికీ సన్నిహితుడూ, హితుడూ ఆయనేనని పురాణాలు చెబుతున్నాయి.స్నేహితుడేది చేసినా మన హితం కోసమే. అది అప్పటికి తెలియకపోయినా తరువాతైనా తెలుస్తుంది. స్నేహంలో ఆ నిశ్చింత ఉంటుంది. అటువంటి నిశ్చింతతో, తనకు వచ్చే ఏ అనుభవమైనా ఈశ్వరానుగ్రహంగా తలపోసినవాడు . ..తన సుఖదుఃఖాలు..  అనుభవాల గురించి కాక, ఈశ్వరానుభూతిలోనే మునకలు వేస్తూ నిత్యం ఆనందంలో నిమగ్నమై ఉంటాడు. ఈ విషయం తెలియనివాడు నిత్యం ఆందోళనకు గురవుతాడు.

శ్రీకృష్ణపరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ కొండ నీడలో భద్రంగా ఉండమని గోవులను, గోపులను, గోపికాగణాన్ని ఆహ్వానించాడు. వారు నిస్సంకోచంగా నిర్భయంగా కొండ నీడన చేరి ఏడురోజులపాటు గోవిందుని చల్లని చరణాల చెంత ఆనందంగా కాలం గడిపారు. అంటే  ఒక భావుకుడు ( శ్రీకృష్ణుడు)  చక్కని భావన చేసి, భగవద్రక్షణ వైభవాన్ని వివరించాడు.

శ్రీకృష్ణ పరమాత్మ  కొండను ఎత్తి అండనిచ్చినప్పుడు కొందరికి ఓ సందేహం కలిగింది. ఎంతకాదన్నా చిన్నవాడు.. ఎంతసేపు కొండను భరించగలడు... మనం కూడా ఒక చేయివేద్దాము...అని తమ చేతికర్రల్ని ఆధారంగా పెట్టారట. ఇంకొందరు ఈ పిల్లవాడీ పర్వతాన్ని భరించి పట్టుకున్నాడు. 

కొంతసేపటికి కొండను భరించలేక వదిలేస్తే మన తలలపైనే పడుతుందేమో అని ఎందుకైనా మంచిదనుకొని కొండకింద నుంచి ఇవతలకి వచ్చారు. అంతలో ఇంద్రుడు కురిపిస్తున్న రాళ్ళవాన తగిలి మళ్ళీ లోపలికి వెళ్ళారు. కొంత సేపటికి మళ్ళీ ఆందోళనతో నిలవలేక మరోమారు బైటకు వచ్చి రాళ్ళవాన తాకిడికి గురై మళ్ళీ కొండ కిందకి వచ్చారు. మిగిలినవారు ఏ దిగులూ లేక శ్రీకృష్ణుడుండగా మనకేం భయం అంటూ స్వామి సన్నిధిలోనే ఉండి ధైర్యంగా, ఆనందంగా, నిశ్చింతగాగడిపారు. 

లోకం తీరు కూడా ఇలాగే ఉంటుంది.గోవర్ధనగిరినే కాదు ప్రతి అణువునూ, బ్రహ్మాండాన్ని తన పట్టులోనుంచి కాపాడేవాడు పరమాత్ముడే. ఆ విషయం తెలిసి స్వామి లీలను ప్రేమగా గమనిస్తూ తన కర్తవ్యాన్ని నిర్భయంగా పాటిస్తూ, స్వామి ఉన్నాడన్న స్పృహతో ఆనందంగా కాలం గడుపుతారు యోగులు, జ్ఞానులు. 

అలా కాక సగం నమ్మకంతో తమవల్లనే అన్నీ జరుగుతున్నాయన్నట్లుగా గర్విస్తూంటారు కొందరు. ఇది అహంకారం. వీరికి శాంతి ఉండదు. మరికొందరు భగవంతుని విశ్వసించక అనుక్షణం భయపడుతూ దుఃఖానికి గురవుతూనే ఉంటారు.

ఒక కొండకింద ఉన్న మూడు రకాల మానవులకీ మూడు రకాల అనుభవాలు,మానసిక స్థితులు. కొందరికి నిశ్చింత, కొందరికి అహంకారం, ఇంకొందరికి ఆందోళన.అందరికి సమానంగా భగవద్రక్షణ లభిస్తూనే ఉంది. ఎరుక లోనే తేడా. మొదటి రకానికి చెందినవాడే సత్యాన్ని గుర్తించినవాడు. అతడు నిత్యశాంతుడు. నిత్యముక్తుడు. బ్రహ్మజ్ఞాని నిజమైన భక్తుడని రుషులు తెలిపారని పండితులు చెబుతున్నారు.