బీఆర్ఎస్​లో అపొజిషన్ నేత ఎవరు?

బీఆర్ఎస్​లో అపొజిషన్ నేత ఎవరు?
  • అధికారం పోయినా కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు: షబ్బీర్​ అలీ
  • మూసీపై  ఇంకా డీపీఆరే ఇవ్వలేదు
  • కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నడు
  • అపొజిషన్ ​నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లో అపొజిషన్ నేత ఎవరో తెలియడం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావులలో అపొజిషన్ నేత ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్​అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవలేదని.. ప్రతిపక్షంలో ఉన్నా కలవడం లేదని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన తరఫున మాట్లాడేవారు సెన్స్​తో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే అప్పుడు నిలదీయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చి పది నెలలు మాత్రమే అయిందని, అధికార యంత్రాంగంపై పట్టు రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కానీ, సీఎం రేవంత్​రెడ్డి ఎంతో గొప్ప ఆలోచనతో కుల మతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్​స్కూళ్లను తీసుకువస్తున్నా.. వాళ్లు తప్పుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్సీ లను గుంజుకొని తన అపొజిషన్ పోగొట్టారని, గంట సమయం కూడా ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండా ఇంటికి పంపారని, ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్​ఎస్​ పార్టీలో చేర్చుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. 1989 లో నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకు వెళ్లొచ్చి మంత్రిని అయ్యానని,  మళ్లీ జైలుకు పంపితే మళ్లీ వచ్చి మంత్రిని అవుతానని పేర్కొన్నారు. గురుకులాల అద్దె చెల్లించలేదని తాళాలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని,  అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా దొంగ డీపీఆర్​లు ఇవ్వం..

మూసీ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ఇంకా డీపీఆర్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా దొంగ డీపీఆర్ లు ఇవ్వమని షబ్బీర్​ అలీ అన్నారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ కి డబ్బులు ఇచ్చి కేటీఆర్​ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారని, తమ ప్రభుత్వం కూలిపోవడం కాదు బీఆర్ ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని షబ్బీర్​ అలీ అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న జనం ఎప్పుడూ అలాగే ఉండాలా ? వారికి మంచి చేయవద్దా? అని ఆయన ప్రశ్నించారు. ఒవైసీ, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సీఎం సమయం ఇచ్చారన్నారు.  నిబంధనల మేరకే కూల్చివేతలు ఉంటాయన్నారు.