గద్వాల మార్కెట్ చైర్మన్ ఎవరో?

గద్వాల మార్కెట్  చైర్మన్  ఎవరో?
  • పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్న లీడర్లు

గద్వాల, వెలుగు: గద్వాల అగ్రికల్చర్  మార్కెట్  కమిటీ చైర్మన్  కుర్చీ కోసం కాంగ్రెస్  లీడర్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మార్కెట్  కమిటీ చైర్మన్  పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. మార్కెట్  కమిటీ చైర్మన్  పదవి దక్కించుకుంటే ప్రోటోకాల్  ఉంటుందనే ఉద్దేశంతో జోరుగా పైరవీలు చేసుకోవడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో చైర్మన్  పదవి జనరల్ కు రిజర్వేషన్ ఉండేది. 

కానీ, ఈసారి బీసీలకు రిజర్వ్​ చేశారు. దీంతో పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ మార్చడంలో కొందరు కాంగ్రెస్  లీడర్లు లోలోపల పైరవీలు చేశారనే విమర్శలున్నాయి. గద్వాల నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉండగా, ఆయా లీడర్లు తమ అనుచరులకు చైర్మన్  పదవి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. గతంలోనే ఈ పోస్టు భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, పార్లమెంట్  ఎన్నికల కోడ్  రావడంతో బ్రేక్  పడింది. కోడ్  ముగియడంతో మరో రెండు రోజుల్లో ఈ పోస్టు భర్తీ చేసే ఛాన్స్  ఉందనే ప్రచారం జరుగుతోంది.

లీడర్ల పోటాపోటీ..

చైర్మన్  పదవి కోసం కాంగ్రెస్  పార్టీలోని లీడర్లు పోటీ పడుతున్నారు. జడ్పీ చైర్​పర్సన్ భర్త తిరుపతయ్య, గట్టు మండలానికి చెందిన కృష్ణమూర్తి, కేటిదొడ్డి మండలానికి చెందిన (మున్నూరు కాపు) వ్యక్తితో పాటు గద్వాల టౌన్ కు చెందిన ఒకరు, ఇటీవల పార్టీలో చేరిన మరో నేత చైర్మన్  పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు చేసుకోవడంతో ఎవరికి పదవి దక్కుతుందోనని అంటున్నారు.

రిజర్వేషన్  మార్పుతో..

అసెంబ్లీ ఎన్నికల ముందు మల్దకల్  మండలం బిజ్వారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి అధికారంలోకి వచ్చాక మార్కెట్  కమిటీ చైర్మన్  పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో కార్యకర్తలంతా నిరాశ చెందారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆయనకు చైర్మన్  పదవి ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతూ వస్తోంది. 

ఇంతలోనే గద్వాల మార్కెట్  చైర్మన్  పదవిని పార్టీలోని మరో వర్గం బీసీ రిజర్వేషన్  చేయించుకుందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు నిరసన తెలపగా, గ్రంథాలయ చైర్మన్  పదవి ఇస్తామని బుజ్జగించినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. అయితే ఎవరికి ఏ పోస్టు వస్తుందో వారం రోజుల్లో తేలిపోతుందని ప్రచారం జరగడంతో హై కమాండ్​ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.