కౌన్‌‌ బనేగా తెలంగాణ సీఎం?

కౌన్‌‌ బనేగా సీఎం?’ ఇదీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల్లో, బయటా జరుగుతున్న చర్చ. ‘ఆలు లేదు, చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం’ అంటే ఇదే కాబోలు! పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా? పక్కనపెట్టి... వస్తే, గిస్తే ముఖ్యమంత్రి అయ్యేదెవరు? ఫలానా సమీకరణమయితే అదుగో ఆయనే ముఖ్యమంత్రి.. కాదు, ఆయనెలా అవుతారు, ఇదుగో ఈయన..’ ఇలాంటి చర్చ జోరందుకుంది. ఇప్పటికో పది పేర్లు ముఖ్యమంత్రి పదవి చుట్టూ గిరికీలు కొడుతున్నాయి. ఈ ముచ్చట ఇలా ఉండగానే మూడు ముఖ్యమైన పార్టీల్లో రోజు రోజుకు పరిస్థితులు మారుతూ విజయావకాశాలు ఉల్టా-పల్టా అవుతున్నాయి. ఒకరు బలపడితే, మరొకరు బలహీనమవుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి మీద కన్నా సహ పోటీదారు మీదే దృష్టి పెడుతున్న పార్టీల వ్యూహాలు కూడా అలాగే పక్కచూపులతో సాగుతున్నాయి.

కొం త కాలం నుంచి స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌‌ రాజకీయాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. చేరికలు తెస్తున్న ఊపుతో పాటు క్రమంగా హైకమాండ్‌‌ పట్టు బిగుస్తున్న సంకేతాలు వెలువకౌన్‌‌ బనేగా సీఎం? పడుతున్నాయి. బీజేపీలో రాష్ట్ర నాయకత్వ వ్యవహారం తెమలకపోగా కొత్త కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఏదో ఒకటి తేల్చి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ నాయకత్వం భావిస్తోంది. ఇక, పాలక బీఆర్ఎస్‌‌ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుంటే ఇది వదిలి, మహారాష్ట్ర పట్టుకొని తిరగటమేమిటనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌, బీజేపీల ఉత్థాన-పతనాల పరిస్థితిని బీఆర్ఎస్‌‌ నిశితంగా గమనిస్తోంది. ఎవరు ప్రధాన ప్రత్యర్థో వారిని కాకుండా, మిగిలిన రెండో ప్రత్యర్థి మరీ జావగారి పోకూడదని కోరుకుంటూ పావులు కదుపుతోంది.

కాదంటే.. ఔననిలే!

బీజేపీ రాష్ట్ర విభాగంలో ఐక్యతే ఓ పెద్ద సమస్య. దాని వల్లే స్తబ్దత పెరిగింది. రాష్ట్ర నాయకత్వ మార్పిడి విషయమై నిర్ణయమేదీ జరగలేదని, అసలా చర్చే జరగలేదని బీజేపీ అధిష్టానం పదే పదే ప్రకటించాల్సి వస్తోంది. వారిపై, మార్పు ఒత్తిడి మాత్రం బలంగా ఉంది. వాలకం చూస్తుంటే, ఎటూ నిర్ణయించలేని సందిగ్ధంలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. రెండు వేర్వేరు పరిస్థితుల్లో... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌కి కేంద్రంలో మంత్రి పదవి, పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌కి ఇక్కడి ‘ప్రచార కమిటీ’ నేతృత్వం ఇస్తామన్నా వారిరువురూ అంగీకరించలేదని ప్రచారం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకే సీఎం పదవిస్తారు అని సాగే ప్రచారం వల్ల... 

వీరిద్దరూ ముఖ్యమంత్రి ఆశావహులని వారి వర్గాలు చెప్పుకుంటాయి. సంజయ్‌‌ని అధ్యక్షుడిగా ఉంచి, అధినాయకత్వం ఏ పదవి ఇచ్చినా జిల్లాల్లో సహకారం ఉండదని, ఏమీ చేయలేనని రాజేందర్‌‌ సందేహం. రాజేందర్‌‌కే పార్టీ పగ్గాలు ఇస్తే.. బీజేపీని వీడటానికి చాలా మంది సిద్ధమవుతారనే వాదన శ్రేణుల్లో ఉంది. అందరినీ కలుపుకొని పోవడం సంజయ్‌‌ వల్ల కావట్లేదని కొందరంటే, ‘ఏదైనా... సంజయ్‌‌తోటే పార్టీ మనుగడ’ అన్నట్టు ఇంకొందరు మాట్లాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఓటమి తర్వాత పార్టీ ముందుకు కదలకపోవడానికి ఈ అనిశ్చితే కారణం. కర్నాటక ఫలితాల తర్వాత మరీ చప్పబడిందనే వాదనను ఎవరూ ఖండించలేకపోతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టడానికి కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి సిద్ధంగా లేరు. జనం పార్టీని గెలిపిస్తే, ఆయనే ముఖ్యమంత్రిగా దిగి రావచ్చనే వాదన కూడా పార్టీలో ఉంది. కొన్ని షరతులతో, తన విషయంలో అధిష్టానం ఎలా నిర్ణయించినా తనకు సమ్మతమేనని సంజయ్‌‌ ఇటీవలే తెలియజేశారనే వార్తలొస్తున్నాయి. దరిమిలా... ప్రచార కమిటీ నేతృత్వం ఈటలకు అప్పగించి, పార్టీ అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి వంటి ప్రత్యామ్నాయ పేర్ల వేట అధినాయకత్వం మొదలెట్టింది. రాజగోపాల్‌‌రెడ్డి ఎమ్మెల్యే పదవి త్యాగంతో వచ్చారని, అలా నిర్ణయిస్తే.. రాష్ట్రంలో, కేంద్రంలో రెడ్డి- బీసీ కాంబినేషన్‌‌ పార్టీకి అనుకూలిస్తుందనే సమర్థింపు వాదనా మొదలైంది.

ఎదుటి పార్టీల్ని బలహీనపరుస్తూ..

తమ పార్టీని బలోపేతం చేయడంపై ఎంత దృష్టి పెడతారో అంతకు మించి ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే పార్టీలు ధ్యాస పెంచే పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో బీజేపీని జీరో చేస్తేనే తనకు అవకాశమని కాంగ్రెస్‌‌, హస్తం పార్టీకి ఆ గతి పట్టిస్తేనే తనకు చాన్స్‌‌ అని బీజేపీ బలంగా భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు దాదాపు సమస్థాయిలో ఉంటే, ఆ ముక్కోణపు పోటీ వల్ల తనకు మేలని బీఆర్‌‌ఎస్‌‌ ఆశించడం సహజం. ఇవన్నీ బేరీజు వేసుకొనే పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్లు కాంగ్రెస్‌‌ వైపు మొగ్గారు. కాంగ్రెస్‌‌లోంచి ముఖ్యమైన పలువురు నేతల్ని పాలక బీఆర్ఎస్‌‌లోకి లాగే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈటల రాజేందర్‌‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌‌లోకి వస్తే ‘ప్రచార కమిటీ’ సారథ్యమిస్తామని ఆఫర్‌‌ ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ ‘ఆయా రామ్‌‌ గయా రామ్‌‌’ ల సందడి, ఆయా పార్టీల్లో ముఖ్యమంత్రి కాగోరే వారో, ఎదుటి వారు కావొద్దని అడ్డుకునే వాళ్లో పావులు కదపడాన్ని బట్టి మరింత పెరగొచ్చు. ఇదీ వరస!

అధిష్టానానికీ పరిమితులున్నాయి

కాంగ్రెస్‌‌ అధినాయకత్వం ఏ రాష్ట్రంలోనైనా, అవసరార్థం సొంత పార్టీలో అసమ్మతిని పోషించగలదే తప్ప తగ్గించలేదు. మరీ ముఖ్యంగా కేంద్రంలో బలహీనంగా ఉన్నపుడు దుస్సాధ్యమే! ‘ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పటి నుంచే అనవసరం, ముందు పార్టీని గెలిపించి అధికారంలోకి తెండి, ఫలితాల తర్వాతే మిగతావి’ అని రాష్ట్ర నాయకులకు అధిష్టానం తరచూ చెబుతోంది. కర్నాటకను ఉదాహరణగా చూపుతోంది. అయినా, పార్టీ నాయక, కార్యకర్తల, శ్రేణుల్లో మాత్రం వ్యూహ-ప్రతివ్యూహాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రమంగా పార్టీకి ఊపు పెరుగుతోందని భావిస్తున్న వారు ‘కాంగ్రెస్‌‌ గెలిస్తే సీఎం పీఠమెవరకి?’ అన్న చర్చను కావాలనే లేవనెత్తుతున్నారు. ‘ఇంకెవరు, పీసీసీ పగ్గాలు పట్టుకున్న రేవంతే!’ అని కొందరంటే, ‘ఆ... ఆయన్ని కానిస్తారా?’ అనేది మరోవర్గం మాట! ‘సీనియర్లు’ అనే బ్రహ్మ పదార్థం గొడుగు నీడలో తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిస్తున్న కొంతమంది మాత్రం, పార్టీ అధికారంలోకి వస్తే అంత తేలిగ్గా రేవంత్‌‌ను సీఎంను కానీయొద్దని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ ప్రాబల్యం కాపాడుకునే క్రమంలో... ప్రత్యామ్నాయ నాయకత్వం కింద సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను తరచూ ప్రోత్సహించే ఈ నాయకులు, ఆయననైనా ఏ మేరకు అంగీకరిస్తారో చూడాలి.

 ప్రజలు పార్టీని గెలిపిస్తే, ఈసారి పట్టం దళితులకే కాబట్టి సీఎం భట్టి అనే వారూ ఉన్నారు. ఢిల్లీ ఆశీస్సులున్న ఒక లాబీ, ఈ దిశలో గట్టిగానే పనిచేస్తోందనడానికి ఆయన ‘పీపుల్స్‌‌ మార్చ్‌‌’ పాదయాత్రే నిదర్శనం. తెలంగాణలో ఏం జరుగుతోందో తనకన్నీ తెలుసని, ఓ ఇద్దరి పనితీరు బాగోలేదని మాట్లాడటం ద్వారా రాహుల్‌‌ గాంధీ గట్టి సంకేతాలే ఇవ్వడానికి యత్నించారు. ఇక, వివాదంలో రెండు గ్రూపులనీ సంతృప్తిపరిచేందుకు, అందరికీ ఆమోదమున్న నాయకుడిగా ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి పేరు సీఎం పదవికి, తెరపైకి రావచ్చనే వాదనా ఉంది. నిజానికి, ఎప్పుడో టీపీసీసీ నేత కావాల్సిన వాడు, నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నిక ముందు, తనకు ఖరారైన ‘ప్రచార కమిటీ సారథ్యాన్ని’ చాకచక్యంగా రేవంత్‌‌రెడ్డి వాయిదా వేయించుకున్న క్రమంలో.. ఆనాటి అవకాశం జీవన్‌‌రెడ్డి చేజారింది.

తండ్రా? తనయుడా?

పాలక బీఆర్‌‌ఎస్‌‌ తిరిగి అధికారంలోకొస్తే.... నిస్సందేహంగా సీఎం కేసీఆరేనని బల్లగుద్దే వారే ఎక్కువ!  కానీ, ఏమైనా జరగొచ్చు! తనయుడు కేటీఆర్‌‌ సీఎం కావొచ్చు అనేవారి సంఖ్య కూడా పెద్దదే!  వెంటనే అవుతారా? అప్పటి వరకు కేసీఆర్‌‌ ముఖ్యమంత్రిగా ఉండి, 2024 లోక్‌‌సభ ఎన్నికల తర్వాత కేటీఆర్‌‌ను నెమ్మదిగా ముఖ్యమంత్రి పీఠం పైకి తెస్తారా? అనే మీమాంస ఒకటుంది. అప్పుడొచ్చే ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండానే, కేసీఆర్‌‌ కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలమై రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తనయుడికి అప్పగిస్తారనే వాదనవైపే అత్యధికులు మొగ్గుతున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపినా.. సీఎం పదవి విషయంలో కేసీఆర్‌‌ అగ్రస్థానంలో ఉంటారనేది జనాభిప్రాయం. 

కర్నాటకలో సిద్ధరామయ్య (దాదాపు అన్ని సర్వేల్లో 40 శాతం)కు లభించినట్టే, రెండో స్థానం వాళ్లు దరిదాపుల్లో లేకుండా జనాదరణ తమ నేతకుంటుందని బీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెబుతాయి. మిగతా పార్టీల్లో సీఎం ఆశావహులు కేటీఆర్‌‌తో సరిపోలుతారేమో తప్ప కేసీఆర్‌‌ను ఢీకొట్టే పరిస్థితి లేదు. అయినా, కేసీఆర్‌‌ కుటుంబపరమైన రాజకీయ నిర్ణయాన్ని ఇవేవీ ప్రభావితం చేయకపోవచ్చు. 2012 లో ఉత్తరప్రదేశ్‌‌లో జరిగినట్టు ఇక్కడా ప్రచారమంతా కేసీఆర్‌‌ పేరిట జరిపి, జనం బీఆర్​ఎస్‌‌ను గెలిపిస్తే నేరుగా కేటీఆర్‌‌నే సీఎంను చేయొచ్చనే ప్రచారం కూడా ఉంది. 2012 ఎన్నికల్లో తండ్రి ములాయం సింగ్‌‌ నేతృత్వంలోనే ప్రచారం జరిపినప్పటికీ, అధికారానికి సరిపడా(224/403) నంబర్లు రాగానే అఖిలేష్‌‌ను సీఎంను చేశారు. అది తన పొరపాటు నిర్ణయమని, ములాయం సింగ్‌‌ యాదవ్‌‌ 2017 దారుణ ఓటమి తర్వాత అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి బీఆర్​ఎస్‌‌లో ఇంకో పేరు వినిపించే ఆస్కారం ఇప్పటికైతే లేదు.

– దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ,