జనవరి 25 నుంచి స్వదేశంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొదటి రెండు టెస్టుల కోసం శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. అందులో 22 ఏళ్ల ఒక యువ ఆటగాడి పేరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మానసిక ఒత్తిడితో జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ జురెల్‌కు అవకాశమిచ్చారు. దీంతో ఎవరా క్రికెటర్..? అతని ప్రదర్శన ఎలా ఉంది..? ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
ఎవరీ ధృవ్ జురెల్..?
22 ఏళ్ల ఈ వికెట్ కీపర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి పేరు నెమ్ సింగ్ జురెల్, తల్లి పేరు రజనీ జురెల్. అతనికి నీరూ జురెల్ అనే సోదరి ఉంది. తల్లి గృహిణి కాగా, తండ్రి నెమ్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధ సైనికుడు. ఆయన 2008లో భారత సైన్యం నుండి హవల్దార్‌గా పదవీ విరమణ చేశారు.
ధృవ్.. భారత జట్టుకు ఎంపికయ్యానని తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. తాను చిన్నతనంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎదురైన కష్టాలను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. క్రికెటర్ అవుతానంటే అందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపిన ధృవ్.. చివరకు మారాం చేయడంతో రూ. 800 అప్పు తెచ్చి తన తండ్రి బ్యాట్ కొనిచ్చాడని తెలిపారు. ఇక క్రికెట్ కిట్ కావాలని మొండికేసిన సమయంలో తన తల్లి బంగారు గొలుసు అమ్మి కొనిచ్చిందని తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
"నాన్న సైనికుడు కావడంతో నేను చదవంతా ఆర్మీ స్కూల్‌లోనే సాగిపోయింది. అప్పుడే నాకు క్రికెట్ అవ్వాలనిపించింది. వేసవి సెలవుల్లో ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో జరిగే క్రికెట్ క్యాంప్‌లో చేరాలనుకున్నా. సెలెక్ట్ అయితే తరువాత చెప్పొచ్చని.. నాన్నకు తెలియకుండా దరఖాస్తు కూడా చేశాను. కానీ, ఈ విషయం తెలిసిన తరువాత నాన్న నామీద సీరియస్ అయ్యారు. ఆపై నన్ను బుజ్జగించడానికి.. రూ.800 అప్పు చేసి మరీ క్రికెట్ బ్యాట్ కొనిచ్చారు. దాంతో కొన్నాళ్లు సరిపెట్టుకున్నా.."
"అలా కొన్నిరోజులు గడిచాక క్రికెట్ కిట్ కొనివ్వమని ఇంట్లో అడిగాను. ధరెంతని నాన్న అడగ్గా.. ఆరేడు వేలు చెప్పేసరికి నన్ను క్రికెట్ ఆడటం మానేయమని చెప్పారు. అంతంటే కొనిచ్చేది లేదని ఇంట్లో అందరి ముందు చెప్పారు. కానీ.. నేను పట్టు వీడలేదు. వెంటనే బాత్రూంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నా.. డోర్ ఓపెన్ చేయకుండా బెదిరించా. అప్పుడు అమ్మ నేను కొనిస్తా ధృవ్ అని మాటిచ్చింది. ఆ తరువాత అన్నట్టుగానే తన బంగారు గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది.." అని ధ్రువ్ జురెల్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నాడు.
క్రికెట్ ప్రయాణం
ధృవ్.. 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఉత్తరప్రదేశ్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో అతని ప్రదర్శన అందరిని ఆకట్టుకోవడంతో రంజీ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. అనంతరం 2022 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతన్ని దక్కించుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ధ్రువ్ జురెల్ రాజస్థాన్ జట్టుకు మంచి స్కోర్లు అందించేవాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్ తో మంచి పినిషింగ్ ఇచ్చేవాడు. ఈ హిట్టింగ్ సామర్థ్యంతోనే అతనికి బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది.
మొదటి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.