మనది గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. సూక్ష్మస్థాయి నుంచి అభివృద్ధి జరగాలని దేశాన్ని గణతంత్రంగా వర్గీకరించారు. పార్లమెంట్‌కు, శాసనసభకు ఉన్న బాధ్యతలు గ్రామసభకు కల్పించారు. పంచాయితీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ1989లో 64వ రాజ్యాంగ సవరణ రూపంలో మొదలై, మూడింట రెండొంతుల బలంతో లోక్ సభలో పాసై, రాజ్యసభలో ఆగిపోయింది. మళ్లీ1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. 1992లో 50 శాతంపైగా మెజారిటీతో 17 రాష్ట్రాల ఆమోదంతో ఈ బిల్లు పాసైంది.1993 ఏప్రిల్ 20న రాష్ట్రపతి సంతకం తర్వాత ఏప్రిల్ 24 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తద్వారా పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి లభించింది. పంచాయతీలకు 29 రకాల విధులు, బాధ్యతలు కల్పించారు. గ్రామసభ, పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు, రిజర్వేషన్లు, పంచాయతీ పదవీకాలం, పంచాయతీలకు అధికారాలు, విధులు, ఆదాయాలు, ఆర్థిక నిర్వహణ, కొన్ని పాత విధానాలు కొనసాగింపు మొదలైన అనేక విషయాలను చట్టంలో పొందుపర్చారు. కొన్ని విషయాలు రాష్ట్ర శాసనసభకు వదిలేశారు. గ్రామపంచాయతీలు ఒక పరస్పర సహకార వ్యవస్థగా రూపొందాలి, గ్రామరాజ్యమే రామరాజ్యమన్న గాంధీజీ ఆదర్శం నిలబెట్టాలనేది దీని సారాంశం.
నిధుల మళ్లింపు
.
రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కల్పించిన రాజ్యాంగ విధులను నిర్వర్తించనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీ చట్టం రూపొందించి తద్వారా పంచాయతీల విభజన, హద్దుల నిర్ధారణ, పంచాయతీల పేర్ల మార్పు మొదలైనవి ఆమోదించారు. కానీ నిధుల మాట మరిచిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలను దివాళా తీయించింది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు కేంద్రం నుంచి వచ్చే నిధులకు కేసీఆర్ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోంది. గ్రామాల్లో విద్య, వైద్యాన్ని నీరుగార్చారు. మన ఊరు – మన బడికి రూ.25 కోట్లతో ప్రకటనలు ఇచ్చి ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించని నేత కేసీఆర్. 2018లో అసెంబ్లీ ఎన్నికల ముందు నూతన పంచాయతీ చట్టం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం ఎన్ని నిధులు ఇస్తే, అన్ని నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి ఇస్తామన్నారు. కానీ ఇచ్చిందేమీ లేదు. అడపా దడపా ఇచ్చింది ఏమైనా ఉంటే కరెంటు బిల్లులకే సరిపోయింది. కేంద్రమిచ్చిన నిధుల్లో కనీసం 5 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. భూములు, ఇళ్లు, రిజిస్ట్రేషన్లు, ఇళ్ల పర్మీషన్లు, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లించి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకొని, గ్రామాలను బిచ్చగత్తెల్లా మార్చారు. కేంద్రం ఇచ్చే డబ్బుల మీద కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. నిధులకు సంబంధించిన సాఫ్ట్ వేర్ కీ వారి వద్దే ఉంచుకుని, తద్వారా సర్పంచులను మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంటి పన్ను వసూలు చేసి, పంచాయతీ సెక్రటరీల జీతాలు తీసుకోవాలని ఆజ్ఞలు జారీ చేశారు.
సంసద్ ఆదర్శ గ్రామ యోజన
నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక గ్రామరాజ్య ఆకాంక్ష నెరవేర్చేందుకు జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన రోజున11 అక్టోబర్ 2015న ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ ప్రారంభించారు. ప్రజల సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేది ఈ పథకం లక్ష్యం. గ్రామాలకు సాధికారత కల్పించి, దాని మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అందిస్తున్నారు. గ్రామ ప్రజలే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అంత్యోదయ అమలు చేయాలి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, పరిశుభ్రత, పచ్చదనం, ఉపాధి, పరస్పర సహకారం, నైతికత, స్వపరిపాలన మొదలైన నియమాలు పాటించాలని నిర్ధారించారు. వీటితో పాటు సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి అనేక నియమాలు రూపొందించారు. ఈ ఆదర్శం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా వివిధ ఆర్థిక సంఘాల ద్వారా కాకుండా, నేరుగా కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ఆటోలు సమకూర్చారు. కేంద్ర నిధులతోనే పంచాయతీ భవనాలు, వీధి లైట్లు, సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, ఉపాధి హామీ, రూపాయి కిలో బియ్యం, చెత్త తీసివేయడం, తడి, పొడి చెత్త వేరుచేయడం, డంపింగ్ యార్డులు సమకూర్చడం, స్మశానవాటికలు, మరుగుదొడ్లు, హరితహారం, పల్లె ప్రకృతివనాలు, రైతు వేదికలు, బావుల, కాలువల పూడికతీతలు, ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలు, గొర్ల, పశువుల పాకలు, పేద మహిళలకు ఉచిత గ్యాస్కనెక్షన్లు మొదలైన అనేక పతకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. సామాజిక భద్రత, గ్రామ మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, అండ్ గ్రీన్ లాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నాయి.
ఆదర్శగ్రామాలు కావాలంటే..
2014 ఎన్నికల్లో స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేస్తామని, మౌలిక సదుపాయాలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటి ముందు ఒక చెట్టు, ఇంటెనుక ఒక చెట్టు, ఊరికొక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంటు, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి రోడ్డు, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం, సోలార్ విద్యుత్ దీపాలు, ప్రతి గ్రామానికి పశువైద్య కాంపౌండ్, ఒక అంబులెన్సు ఇస్తామని లెక్కకు మించిన హామీలిచ్చి, ఓట్లేయించుకున్న ఈ మోసపు ప్రభుత్వం ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. తెలంగాణలో గ్రామీణ సర్వాంగీణ వికాసం జరగాలంటే పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రజల మధ్య సద్భావన మొదలైనవి అమలు కావాలంటే, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే, స్వావలంబన, స్వయం సమృద్ధి, స్వపరిపాలన అమలు కావాలంటే ఈ ప్రభుత్వం దిగిపోయిన రోజే సాధ్యమవుతుందని, అప్పుడే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. ఆ రోజు ఎంతో దూరం లేదని ఆశిద్దాం!.
సుకుమా గ్రామం
భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్ర గ్రామరాజ్యాలు ఉండేవి. గ్రామమే న్యాయ, రక్షణ, వ్యవసాయం, వృత్తులు, విద్యా, వైద్యం లాంటి అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించుకునేవి. ఇంగ్లీష్ వారు గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించాక మన పాలకులు గ్రామాలను బానిసలుగా మార్చారు. గ్రామం అంటే గౌరవ వ్యవస్థ, ఆహార వ్యవస్థ. గ్రామంలో అతిథులకు ఒకప్పుడు భోజనం పెట్టేవారు. గ్రామంలో18 రకాల పన్నులు ఉండేవి. ఉదాహరణకు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో భుజ్జిల్లాలో సుకుమా అనే గ్రామంలో నేను స్వయంగా 3 రోజులు పర్యటించాను. ఆ గ్రామంలో వ్యవసాయం, పూర్తిస్థాయిలో బట్టలు నేయడం, అన్ని రకాల మిషన్ లు కలిగి ఉండి గ్రామానికి, వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లు తయారు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పాడి ఆవులు ఉంటాయి. సమష్టి ఆవుల నిర్వహణ ఉంటుంది. బెల్లం తయారు చేస్తారు. ఆ ఊరిని దర్శించిన వారికి ఉచితంగా భోజనం పెడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాన్ని నిర్వహించడమే కాక అన్ని రకాల ఉత్పత్తులు వారే తయారు చేసుకుంటారు. వారే పాలించుకుంటారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ‘మా ఊరే ప్రపంచం – ప్రపంచం మా ఊరు కాదు’ అని వారంటారు. అంటే ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు, ఉత్పత్తులు తమ ఊరే తయారు చేసుకుంటుందని, భూమి పంట, నీటి పంట, అడవి పంట మా గ్రామం సొంతం అంటారు.
నరహరి వేణుగోపాల్ రెడ్డి