
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేసులోకి అనూహ్యంగా ఆదివాసీ డాక్టర్ నైతం సుమలత పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆదివారం ఆమె హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఎండీ ఫిజీషియన్ గా పని చేస్తున్న డాక్టర్ సుమలత గోండు తెగకు చెందిన మొదటి మహిళా డాక్టర్‌గా గుర్తింపు పొందారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి తదితర ఏజెన్సీ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.
సుమలత తాత మర్సుకోల కాశీరం గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసురాలిగా ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సుమలత సిద్ధమయ్యారు. సుమలత మొదట బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. ఆ పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. బీఆర్ఎస్ నుంచి గొడం నగేశ్‌ను బీజేపీలో జాయిన్ చేసుకొని టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. తాజాగా సుమలతకు సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పిలుపురావడం, తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలివ్వడం ఆ పార్టీ శ్రేణులను విస్తుపోయేలా చేసింది.
లంబాడానా.. ఆదివాసీనా..?
లంబాడా, ఆదివాసీల్లో ఏ వర్గానికి టికెట్ కేటాయించాలనే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీ అభ్యర్థులకే టికెట్ కేటాయించాయి. ఇక మిగిలింది కాంగ్రెస్. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆదివాసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతుండగా, లంబాడా సామాజికవర్గంలో బలమైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఏఐసీసీ స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ లంబాడ సామాజికవర్గానికి చెందిన రాథోడ్ రమేశ్‌కు ఇచ్చింది . కానీ ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆదివాసీకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్లు చెప్తున్నారు. కానీ మిగిలిన ఇద్దరు ఆదివాసీలు కావడంతో లంబాడా సామాజికవర్గానికి టికెట్ కేటాయిస్తే కలిసివచ్చే అవకాశముందని ఆ వర్గం నేతలు వాదిస్తున్నారు.